
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ప్లేయర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు మించిన శక్తి సామర్థ్యాలు రాహుల్‌లో ఉన్నాయని గంభీర్ చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. 48 బంతుల్లో 98 పరుగుల బాదాడు. దాంతో పంజాబ్ జట్టు 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది.
అయినా రన్‌రేట్ తక్కువగా ఉండటంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోతో మాట్లాడుతూ.. అతని ఆటతీరును విశ్లేషించాడు. ఇన్నాళ్లు ఈ సామర్థ్యాన్ని ఎక్కడ పెట్టావని రాహుల్‌ను ప్రశ్నించాడు. ఇలా ఆడుంటే పంజాబ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరేదన్నాడు. కెప్టెన్సీ కారణంగా స్వేచ్చగా ఆడలేకపోయాడన్నాడు.
'రాహుల్.. నీలో ఉన్న విధ్వంసకర ఆటగాడిని ఇన్నాళ్లు ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయలేదు. ఇక కోల్పోవడానికి ఏం మిగల్లేదనుకున్న సమయంలో.. నీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలన్ని బయటకి తీశావు. నీ సత్తా ఏంటో చూపించావు. ఇవాళ నీ ఆటను చూసి ప్రపంచమే మురిసిపోతోంది. కోహ్లీ, రోహిత్ శర్మల కంటే ఎక్కువగా నీ ఆటతీరు గురించే చర్చిస్తున్నారు. మిగతా మ్యాచుల్లో కూడా ఇలాగే ఆడి ఉంటే పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరి ఉండేది. బహుశా నాయకత్వ బాధ్యతల కారణంగా.. అన్ని మ్యాచుల్లో స్వేచ్ఛగా ఆడలేకపోవచ్చు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే గొప్ప శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ షాట్లలో గొప్ప వైవిధ్యం ఉంది'అని గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు.
ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు.. 6 మ్యచుల్లో విజయం సాధించి 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. గత సీజన్ మాదిరే గెలిచే మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిపాలైంది. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. ఓపెనర్లు శుభారంభం అందించినా ఆ జోరును కొనసాగించే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ లేక పంజాబ్ చతికలపడింది. కేఎల్ రాహుల్ మాత్రం 13 మ్యాచుల్లో 623 పరుగులు చేసాడు.
ఇక పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. సోమవారం రాత్రి చెన్నై, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుండగా.. మంగళవారం రాత్రి ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.