కొలంబో: ఆసియాకప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియాపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్థాన్‌పై విజయం కంటే శ్రీలంకపై సాధించిన గెలుపే గొప్పదని అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ టోర్నీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ టీమిండియా సాధించిన ఈ విజయం అద్బుతమని కొనియాడాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై నెలకొన్న అనుమానాలు కూడా తీరాయని చెప్పాడు. 'ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. పాకిస్థాన్‌పై విజయం కంటే శ్రీలంకను ఓడించిన తీరే అద్భుతం.

ఈ విజయం తప్పకుండా భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెంచుతోంది. ఈ విషయం ఎలాంటి అనుమానం లేదు. బ్యాటింగ్‌లో విఫలమైందని అంటున్నప్పటికీ.. దాని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు జట్టులో ఒక్కరి మీదనే అనుమానం ఉండేది. అది స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.
గాయం నుంచి కోలుకుని వచ్చాక ఎలా బౌలింగ్ చేస్తాడనే ఆందోళన ఉండేది. కానీ అతను అసాధారణ రీతిలో రిథమ్‌ను అందిపుచ్చుకుని బౌలింగ్ వేశాడు. ఇక కుల్దీప్ అయితే అద్భుతం. కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ వికెట్‌పై 214 పరుగులను కాపాడుకోవడం అద్భుతం.
శ్రీలంక బ్యాటర్లు కూడా స్పిన్‌ను సమర్థంగా ఆడుతారు. సొంత మైదానంలో వారిని కట్టడి చేయడం చాలా కష్టం. కానీ, భారత బౌలర్లు చేసి చూపించారు. బుమ్రా వికెట్ల పతనం ప్రారంభించగా.. కుల్దీప్ తనదైన శైలిలో ముగించాడు. తప్పకుండా ఆసియా కప్ ఫైనల్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లతోపాటు కెప్టెన్‌కు ఈ విజయాలు ఆత్మవిశ్వాసం పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు.
లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.