Gautam Gambhir: అఫ్గానిస్థాన్ కూడా టీ20 ప్రపంచకప్ గెలవచ్చు!

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ కూడా విజేతగా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. మెగాటోర్నీలో ఏ జట్టును అంచనా వేయడానికి లేదన్నాడు. అఫ్గాన్ జట్టులో రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లున్నారని, వారు మ్యాచ్ గమనాన్నే మార్చేస్తారని తెలిపాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో దాయదీ పాకిస్థాన్‌పై భారత్‌దే పై చేయి అవుతుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

తక్కువ అంచనా వేయవద్దు..
'పాకిస్థాన్‌పై కూడా ఆశలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం పాక్‌తో పోల్చితే టీమిండియా బలమైన జట్టు. కానీ, టీ20ల్లో ఎవరు గెలుస్తారో ఎప్పుడూ ఊహించలేం. ఓ జట్టు మరో జట్టుపై గెలుస్తుందని పక్కాగా అంచనా వేయలేం. ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. అఫ్గానిస్థాన్ జట్టును కూడా తక్కువ చేయకూదు. రషీద్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ గమనాన్నే మార్చేస్తారు. పాకిస్థాన్ జట్టులోను అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కానీ, భారత్‌తో ఆడేప్పుడు.. పాకిస్థాన్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. పరిస్థితులు తారుమారైతే అఫ్గాన్ జట్టు కూడా కప్ గెలిచే అవకాశముంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

గ్రూప్ 1లో హోరాహోరీ..
బలమైన జట్లతో గ్రూప్ 1లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. వెస్టిండీస్ ఆటను ఏ మాత్రం అంచనా వేయలేం. ఆ జట్టుకు ఉన్న ఫైర్ పవర్ బ్యాటింగ్ లైనప్‌తో మూడో టైటిల్ గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంగ్లండ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ జట్టు నిలకడగా రాణిస్తుంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత మరింత బలంగా తయారైంది. సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీ నేపథ్యంలో ఆస్ట్రేలియా టీమ్ ప్రస్తుతం లయ తప్పినట్లు కనిపిస్తుంది. కానీ వారికి అచ్చొచ్చిన రోజున ఆ జట్టు చాలా ప్రమాదకరంగా చెలరేగుతోంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ మ్యాచ్ మంచిదే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచులోనే తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని కూడా ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. మేం గెలిచిన 2007లోనూ అంతే! ఆ టీ20 ప్రపంచకప్‌లో మా తొలి మ్యాచ్ స్కాట్లాండ్‌తో జరగాలి. వర్షంతో అది కుదర్లేదు. ప్రాక్టికల్‌గా తొలి మ్యాచ్ ఆడింది మాత్రం పాకిస్థాన్‌తోనే. నేను ఇప్పుడు చెబుతోందీ అదే. ఆరంభంలోనే పాక్‌తో తలపడితే టీమిండియాకు మేలు. అదే పనిగా పాక్ మ్యాచ్ గురించి ఆలోచించకుండా మిగతా టోర్నీపై దృష్టి పెట్టొచ్చు. దేశ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుందనుకోండి. ఫలితం గురించి మనకు తెలియదు. కానీ, టోర్నీ ఆరంభంలోనే రెండు జట్లు ఆడుతున్నందుకు నేనైతే సంతోషంగా ఉన్నాను' అని గంభీర్ స్పష్టం చేశాడు.

పాక్‌తో భారత్ వేట మొదలు..
పాకిస్థాన్‌తో పోరుతో మెగా టోర్నీని ఆరంభించనున్న భారత్.. తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబరు 31న అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. అనంతరం నవంబరు 3న అఫ్గానిస్థాన్‌తో ఆడుతుంది. భారత్ తన మిగతా రెండు సూపర్-12 మ్యాచ్‌లను క్వాలిఫయింగ్ గ్రూప్-బి విజేత (నవంబరు 5)తో, గ్రూప్-ఎ రన్నరప్ (నవంబరు 8)తో ఆడుతుంది. టోర్నమెంట్ తొలి రౌండ్ అక్టోబరు 17న ఒమన్‌లో ఆరంభమవుతుంది. గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో అసలు దశ అయిన సూపర్ 12 అక్టోబరు 23న మొదలవుతుంది. ఆ రోజు ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా, రెండు సార్లు ఛాంపియన్ వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ తలపడతాయి. తొలి సెమీఫైనల్ నవంబరు 10న అబుదాబిలో, రెండో సెమీఫైనల్ నవంబరు 11న దుబాయ్‌లో ఆడతారు. నవంబరు 14న జరిగే ఫైనల్‌కు దుబాయ్ ఆతిథ్యమిస్తుంది. నవంబర్ 15 రిజర్వ్ డే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications