టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అనవసర హైప్ క్రియేట్ చేసిన అతన్ని హీరో చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశాడు.
ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 209) డబుల్ సెంచరీతో చెలరేగాడు. బ్యాటర్లంతా విఫలమైన వేళ అతనొక్కడే అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. తద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున డబుల్ సెంచరీ సాధించి మూడో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గాను చరిత్రకెక్కాడు.
ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అయితే యశస్వి.. సర్ బ్రాడ్‌మన్ కంటే ఎక్కవని ఆకాశానికెత్తాడు. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు సైతం యశస్విపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దాంతో సోషల్ మీడియా వేదికగా యశస్వి జైస్వాల్ పేరు మారు మోగుతుంది. ఈ క్రమంలోనే గంభీర్.. యశస్వీని హీరో చేసి అతనిపై అనవసర ఒత్తిడిని పెంచవద్దని అభిమానులు, మీడియా, మాజీ క్రికెటర్లకు రిక్వెస్ట్ చేశాడు.
ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'చిన్న వయసులోనే అరుదైన రికార్డులు సాధిస్తున్న యశస్వి జైస్వాల్‌కు అభినందనలు. అతను ఇప్పుడిప్పుడే తన కెరీర్‌లో ఎదుగుతున్నాడు. అతన్ని స్వేచ్చగా ఆడనివ్వండి. భారత్‌లో అందరికీ ఓ చెడు అలవాటు ఉంది.
ముఖ్యంగా మీడియా ఆటగాళ్ల సక్సెస్‌ను అతి చేసి చూపిస్తోంది. వారికి ఏదో ట్యాగ్ అంటగట్టి హీరోలను చేస్తోంది. ఇలాంటి అనవసర ప్రచారం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. కాలక్రమంలో వాళ్లు సహజమైన ఆటను ఆడలేకపోతారు. అంచనాలను తట్టుకోలేక ఒత్తిడిలో కూరుకుపోతాడు. తద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.'అని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు.
వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(6/45) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.3 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది.
ఆ జట్టులో జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బెన్ స్టోక్స్(47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా(6/45) సిక్సర్ కొట్టగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్‌లీకి ఓ వికెట్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులు మాత్రమే చేసింది.