
బరోడా విడగొడితే..
2020 దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బరోడా టీమ్ కెప్టెన్ అయిన కృనాల్ పాండ్యా అకారణంగా తనపై నోరు పారేసుకున్నాడని.. టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు తన పరువుకు భంగం కలిగించాడని వైస్ కెప్టెన్ దీపక్ హుడా సంచలన ఆరోపణలు చేశాడు.
అంతేకాకుండా తాను జట్టును వీడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ వివాదం భారత క్రికెట్‌లో పెనుదుమారం సృష్టించడంతో విచారణ చేపట్టిన బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) తప్పు దీపక్ హుడాదేనని తేల్చి అతన్ని టీమ్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో హుడా ఆ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడలేదు. బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు.

లక్నో టీమ్ కలిపింది...
అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఉప్పు-నిప్పుగా ఉంటున్నారు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ రూపంలో మళ్లీ ఒకే జట్టు తరఫున బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ ఇద్దరూ లక్నో టీమ్‌కు కలిసి ఆడనున్నారు. ఈ సీజన్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) టీమ్.. ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లను కొనుగోలు చేసింది.
ముందుగా దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు తీసుకున్న లక్నో.. ఆ తర్వాత కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే మిడిలార్డర్ కీలకం కానున్న ఈ ఇద్దరూ కలిసి ఆడాల్సి వస్తే.. వీరి విబేధాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.

రోజూ డిన్నర్ చేయాల్సిన పనిలేదు..
అయితే ఈ వాదనను గంభీర్ తప్పుబట్టాడు. స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మైదానంలో రాణించాలంటే బెస్ట్ ఫ్రెండ్స్ కానక్కర్లేదని స్పష్టం చేశాడు. 'ఇద్దరు కలిసి మైదానంలో రాణించాలంటే ఆఫ్‌ద ఫీల్డ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యుండాల్సిన అవసరం లేదు. దీపక్, కృనాల్ ప్రొఫెషనల్ క్రికెటర్లు. జట్టులో వారి బాధ్యతలు ఏంటో వారికి బాగా తెలుసు.
ఒక జట్టులో ఆడుతున్నప్పుడు.. సహచర ఆటగాళ్లతో కలిసి ప్రతీ రోజు డిన్నర్ చేయాల్సిన అవసరంలేదు. నా హయాంలో నేను ఆడిన జట్లలోని చాలా మందితో స్నేహం చేయలేదు. అంతమాత్రన నేను జట్టుకోసం మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ఆగిందా? దీపక్, కృనాల్ ఇద్దరూ పరణితి చెందిన ఆటగాళ్లు. పైగా లక్నో జట్టును గెలిపించేందుకే వారు ఇక్కడికి వచ్చారని విషయం తెలుసు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

టైటిలే లక్ష్యంగా..
ఐపీఎల్‌లోకి అడుగుపెడుతూనే సంచలనం సృష్టించిన నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ .. ఇప్పుడు ఆటపై దృష్టి పెట్టింది. మెగా ఆక్షన్‌లో అన్ని ఫ్రాంచైజీల కంటే దూకుడుగా వ్యవహరించి.. పక్కా ప్రణాళికలతో సరికొత్త ప్లేయర్లను తీసుకున్న సూపర్ జెయింట్స్ అరంగేట్రంలోనే ట్రోఫీతో అద్భుతం చేయాలని భావిస్తోంది.
మెగా లీగ్‌పై తనదైన ముద్ర వేసిన కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంచుకుని తొలి అడుగు ఘనంగా వేసింది! ఇక పేపర్ మీద టీమ్ కాంబినేషన్ అంతా బాగానే కనిపిస్తున్నా.. అసలు సమరంలో ఎంతవరకు సత్తా చూపిస్తుందో చూడాలి..! ఓవరాల్‌గా వేలాది కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసి మెగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీ.. ఫస్ట్ ట్రోఫీని సాధించే లక్ష్యంతో సమాయత్తం అవుతోంది.


Click it and Unblock the Notifications
