టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తనకు ఉన్న సంబంధం గురించి ఈ దేశానికి తెలియాల్సిన అవసరం లేదని మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తమ మధ్య ఉన్న బంధం ప్రజలకు మసాల న్యూస్ ఇచ్చేందుకు కాదని గంభీర్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ సందర్భంగా గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మైదానంలోనే గొడవపడిన విషయం తెలిసిందే. కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్ ఉన్నప్పుడు గతంలో ఒకసారి ఈ ఇద్దరూ వాగ్వాదానికి దిగగా.. గతేడాది మరోసారి గొడవపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా గంభీర్ ఉండగా.. ఆ జట్టు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను తిట్టాడని కోహ్లీతో గంభీర్ వాగ్వాదానికి దిగాడు. అంతకుముందు ఆర్‌సీబీ అభిమానులను గంభీర్ అవమానించగా.. కోహ్లీ తన ఆటతోనే బదులిచ్చాడు.

ఈ ఇద్దరి గొడవ గత సీజన్‌లోనే అత్యంత వివాదాస్పద ఘటనగా నిలిచిపోయింది. ఆ తర్వాత గంభీర్ కనిపించినప్పుడల్లా కోహ్లీ ఫ్యాన్స్ అతన్ని ఎగతాళి చేశారు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఈ ఇద్దరూ స్టార్ ఆటగాళ్లు తమ గొడవలకు ముగింపు పలికారు. ఒకరినొకరిని హగ్ చేసుకున్నారు. దాంతో ఈ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు.
ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. గత మూడు సీజన్లలో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరని ఆ జట్టు.. గంభీర్ రాకతో విజేతగా నిలిచింది. ఈ విజయానంతరం ఓ ఛానెల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో గంభీర్‌ను కోహ్లీతో ఉన్న సత్సంబంధాల గురించి ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. తమ మధ్య ఉన్న బంధం గురించి ఈ దేశానికి అవసరం లేదని చెప్పాడు.
'విరాట్ కోహ్లీతో నాకున్న సంబంధం గురించి ఈ దేశానికి అవసరం లేదు. తన జట్టును గెలిపించేందుకు కోహ్లీ తన భావాలను వ్యక్తికరించాడు. నేను కూడా అదే చేశాను. మా మధ్య ఉన్న సంబంధం ప్రజలకు మసాలా ఇవ్వడానికి కాదు.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

గతంలో విరాట్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నవీన్ ఉల్ హక్, గౌతమ్ గంభీర్‌లను తాను హగ్ చేసుకుంటే చాలా మంది బాధపడ్డారని తెలిపాడు. తన ప్రవర్తనను తప్పుబట్టారని చెప్పుకొచ్చాడు.
'ప్రజలు నా ప్రవర్తన పట్ల నిరాశకు గురయ్యాడు. ముందుగా నేను నవీన్ ఉల్ హక్‌ను హగ్ చేసుకున్నాను. ఆ తర్వాత గౌతమ్ గంభీర్‌ను కౌగిలించుకున్నాను. దాంతో మసాల వార్తలకు ముగింపు పడింది. గొడవలను కొనసాగించేందుకు మేం ఏం చిన్న పిల్లలం కాదు.'అని కోహ్లీ స్పష్టం చేశాడు.