
న్యూఢిల్లీ: తాను ఆడిన కెప్టెన్లలో అనిల్ కుంబ్లేనే అత్యుత్తమ సారథని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తెలిపాడు. భారత గ్రేట్ కెప్టెన్స్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ సారథ్యంలో కూడా ఆడిన ఈ క్రికెటర్ కమ్ పొలిటీషియన్.. తనకు మాత్రం కుంబ్లేనే బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కుంబ్లే ఎక్కువ రోజులు కెప్టెన్‌గా కొనసాగి ఉంటే కెప్టెన్సీ రికార్డులన్నిటినీ అధిగమించేవాడని అభిప్రాయపడ్డాడు.
'రికార్డుల పరంగా ధోనీనే అత్యుత్తమ సారథి కావొచ్చు. కానీ నేను ఆడిన కెప్టెన్లలో కుంబ్లే బెస్ట్.'అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. 'సౌరవ్ కూడా కెప్టెన్సీ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించాడు. కానీ భారత జట్టుకు ఎక్కువ రోజులు కెప్టెన్‌గా ఉండాలని నేను కోరుకున్న సారథి మాత్రం అనిల్ కుంబ్లే. ఆయన సారథ్యంలో నేను సుమారు 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాను. కుంబ్లే ఎక్కువ రోజులు కెప్టెన్‌గా కొనసాగలేదు. ఒకవేళ అతను చాలా కాలం జట్టును నడిపించి ఉంటే ఎన్నో రికార్డులు అధిగమించేవాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
2007లో రాహుల్ ద్రవిడ్ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న కుంబ్లే 14 టెస్టులకు సారథ్యం వహించాడు. ఇందులో భారత్ మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలవగా.. 6 మ్యాచ్‌లు ఓడి, ఐదు డ్రా చేసుకుంది. ఇప్పటికీ టెస్టు, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కుంబ్లేనే ఉన్నాడు. ఇక అతని కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. 2008లో ధోనీ మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఇక ఇటీవల ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ రోహిత్ శర్మనే అని ఇదే షోలో చెప్పిన గంభీర్.. క్రికెట్ నుంచి తప్పుకునేలోపు అతడు మరో మూడు ట్రోఫీలైనా సులువుగా తన ఖాతాలో వేసుకుంటాడని జోస్యం చెప్పాడు.
'జట్టును ఎన్నిసార్లు విజేతగా నిలిపామన్నదానిపైనే కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. ఇది రోహిత్‌కు సరిగ్గా సరిపోతుంది. ముంబై ఇండియన్స్ సారథిగా అతను నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించాడు. కెరీర్ ముగిసేలోగా మరో మూడు టైటిల్స్ గెలుస్తాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ సారథిగా అతను చరిత్రలో నిలుస్తాడు. కనీసం 6-7 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే సత్తా రోహిత్‌కు ఉంది' అని హిట్‌మ్యాన్ కెప్టెన్సీని గంభీర్ కొనియాడాడు.