
అంచనాలు పెట్టుకోవద్దు:
స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్ ప్లాన్'లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కేవలం యువ జట్టుతోనే టీమిండియా సిరీస్ గెలవడం సంతోషించదగ్గ విషయం. శుభ్‌మన్ గిల్‌కు నా అభినందనలు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇప్పుడే అడుగుపెట్టాడు. ఒక్క సిరీస్‌లోనే రాణించాడని అతనిపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు' అని అన్నాడు.

తల దించుకొని ఆడాలి:
'శుభ్‌మన్ గిల్‌పై అనవసర ఒత్తిడి పెడితే కెరీర్ దెబ్బతినే అవకాశం ఉంది. గిల్‌కు మంచి టాలెంట్ ఉంది. ఆ విషయం నేను ఒప్పుకుంటా. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శన చేసేవరకు గిల్ అనవసర ఆర్బాటాలకు పోకూడదు. తల దించుకొని ఆడితే బాగుంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ అంత సులువుకాదు. మరింత శ్రమించాలి' అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపై మట్టికరిపించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన తరుణంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రహానే సారథిగా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.

అనుకోకుండా అవకాశం:
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ మూడు టెస్టు మ్యాచ్‌లాడి 259 పరుగులు చేశాడు. ముఖ్యంగా నాలుగో టెస్టు జరిగిన గబ్బా మైదానంలో గిల్ 91 పరుగుల కీలక ఇన్నింగ్స్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలి టెస్టులో విఫలమవడంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టాడు. ఇక ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్, టీమిండియాల మధ్య తొలి టెస్టు జరగనుంది. అందులోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

యూవీ ట్రైనింగ్‌తోనే:
ఇటీవల గిల్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందు యువరాజ్ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడింది. క్యాంప్‌లో భాగంగా వందల సంఖ్యలో షార్ట్ పిచ్ బంతులు విసిరి.. నాతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించాడు. ముఖానికి వచ్చే బంతులను ఎలా సమర్థంగా ఆడాలనేది నేర్పించాడు. వివిధ యాంగిల్స్‌లో బంతులు విసురుతూ బ్యాటింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగయ్యేలా చేశాడు. యూవీ ట్రైనింగ్‌తోనే ఆసీస్ సిరీస్‌లో రాణించా. కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్ లాంటి పేసర్ల బంతులను సమర్థంగా ఎదుర్కొగలిగా' అని తెలిపాడు.
ఎక్కడ ఉన్నా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూస్తే.. గుండెలో గర్వం ఉప్పొంగుతుంది: యూవీ


Click it and Unblock the Notifications












