Gautam Gambhir: రిషభ్ పంత్ చేసిన ఆ తప్పిదమే ఢిల్లీ కొంపముంచింది!

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన తప్పిదమే కారణంగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. చివర్లో సీనియర్ పేసర్ కగిసో రబడాతో బౌలింగ్ చేయకుండా పంత్ మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ఇక ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సీఎస్‌కే తొమ్మిదోసారి ఫైనల్ చేరింది. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన గంభీర్.. మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

పంత్ ఘోర తప్పిదం..
'కగిసో రబడా లాంటి సీనియర్ పేసర్‌ను 19వ ఓవర్‌లో బౌలింగ్ చేయించకపోవడమే ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన అతిపెద్ద తప్పు. అవేశ్‌ఖాన్ ఆ ఓవర్ తొలి బంతికి రుతురాజ్ గైక్వాడ్(70) లాంటి కీలక బ్యాట్స్‌మన్ వికెట్ తీసినా.. నేను మాత్రం రబడా బౌలింగ్‌కే మొగ్గు చూపేవాడిని.' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక అవేశ్ ఖాన్ వేసిన ఆ ఓవర్‌లో చెన్నై ఓ వికెట్ కోల్పోయి 11 పరుగులు సాధించింది. మొయిన్ అలీ ఓ బౌండరీ బాదగా.. క్రీజులోకి అప్పుడే వచ్చి ధోనీ ఓ భారీ సిక్సర్ బాదాడు. దాదాపు ఆ సిక్స్ 84 మీటర్లు దూరం వెళ్లింది. ఈ సిక్సే మ్యాచ్ టర్నింగ్ పాయింట్.
చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 13 పరుగులే అవసరమయ్యాయి. ఆ సమయంలోనే టామ్‌కరన్ వేసిన చివరి ఓవర్ ధోనీ మూడు ఫోర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.

క్రెడిట్ అంతా ధోనీదే..
అయితే ఈ ఓవర్ రబడా వేసుంటే ఇన్ని పరుగులిచ్చేవాడు కాదని, పైగా చెన్నైపై ఒత్తిడి ఉండేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక వరుసగా విఫలమైనా రాబిన్ ఊతప్పపై నమ్మకం ఉంచి అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్ తీసుకోవడం ధోనీ తీసుకున్న మంచి నిర్ణయమని గంభీర్ ప్రశంసించాడు. 'రాబిన్ ఊతప్ప ఇన్నింగ్స్ క్రెడిట్ అంతా ధోనీకే దక్కుతుంది. మూడో స్థానంలో మొయిన్ అలీని బరిలోకి దించే అవకాశం ఉన్నా మహీ ఉతప్పను బరిలోకి దించాడు. అతనిపై ధోనీకి అంత నమ్మకం ఉంది. అంతేకాకుండా ఊతప్పకు టాపార్డర్‌లో ఆడటం ఇష్టం'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ధోనీ సూపర్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), కెప్టెన్ రిషభ్ పంత్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్) ధాటిగా ఆడారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63) రాణించారు. కెప్టెన్ ధోనీ (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో చెన్నైను విజయతీరానికి చేర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications