ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రమాణికంగా నిర్వహించే యో-యో టెస్ట్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యో-యో అనేది ఓ పనికిమాలిన టెస్ట్ అని, ఇది క్రికెటర్లకు ఏ మాత్రం అవసరమే లేదని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా జట్టును ఎంపిక చేయాలని, ఫిట్‌నెస్ టెస్ట్‌లతో కాదన్నాడు.
భారత జట్టులో ఆటగాళ్ల ఫిట్‌నెస్ సామర్థ్యాలను పరీక్షించేందుకు యో-యో టెస్ట్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ టెస్ట్‌లో పాసైన ఆటగాళ్లనే సెలెక్టర్లు భారత జట్టుకు ఎంపిక చేస్తారు. టీమిండియాలోకి ఫిట్‌నెస్ సంప్రదాయాన్ని తీసుకొచ్చిన విరాట్ కోహ్లీ సారథ్యంలో ఈ యో యో టెస్ట్‌ను ప్రవేశ పెట్టారు.

గత 10 ఏళ్లుగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను యో-యో టెస్ట్ ద్వారానే నిర్ణయిస్తున్నారు. విరాట్ కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు యో-యో టెస్ట్‌లో బెస్ట్ పెర్ఫామర్స్‌గా గుర్తింపు పొందారు. భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి చాలా దేశాలు ఈ పద్దతిని ఉపయోగిస్తున్నాయి.
తాజాగా ఈ యో-యో టెస్ట్‌పై ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన గంభీర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కోచ్ గుర్తించాలి కానీ, యో యో టెస్ట్‌లు కాదని అభిప్రాయపడ్డాడు.
'ఫిట్‌నెస్ ఒక అంశంగా మాత్రమే ఉండాలి. ఫిట్‌గా ఉన్నామని తెలుసుకునేందుకు ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదు. ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌లను నేను ఏ మాత్రం అంగీకరించను. కొంతమంది ఆటగాళ్లు శారీరకంగా దృఢంగా ఉంటారు. మరి కొందరు జిమ్‌లో బాగా బరువులు ఎత్తగలరు. కొందరు మంచి సామర్థ్యం కలిగి ఉంటారు. కానీ బరువులు ఎత్తలేరు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారా? లేదా? అని నిర్ణయించాల్సింది ట్రైనర్. యో-యో టెస్ట్ కాదు.
ఏదీ కూడా బెంచ్‌మార్క్‌గా ఉండకూడదు. దానికి నేను ఏ మాత్రం ఒప్పుకోను. నా విషయానికొస్తే.. నేను యో-యో టెస్ట్‌లో అర్హత సాధించగలను. కానీ జిమ్‌లో బరువులు ఎత్తలేను. అంత మాత్రానా నాకు ఫిట్‌నెస్ లేనట్లు కాదు. ఆటగాళ్ల బలహీనతలను అధిగమించేలా చేయడమే ట్రైనర్ బాధ్యత. కానీ, యో-యో ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయడం సరైన మార్గం కాదు. ఆటగాళ్ల ప్రతిభ, బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేయాలి.'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది. అతని వారసుడిగా గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యోయో టెస్ట్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.