
న్యూఢిల్లీ: పాకిస్థాన్ అంటేనే ఒంటి కాలుపై లేచే భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. అలాంటిది ఆ దేశ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. క్రికెట్ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన స్పిన్నర్ అజ్మలేనని చెప్పుకొచ్చాడు. దూస్రాతో కూడిన అతని బౌలింగ్ చాతా ప్రమాదకరంగా ఉండేదన్నాడు.
స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న ఈ బీజేపీ ఎంపీని తాను అత్యంతగా ఆస్వాదించిన పాక్ బౌలర్ ఎవరో చెప్పమనగా.. అతను అజ్మల్ పేరు సూచించాడు.'అజ్మల్ బౌలింగ్ ఎదుర్కోవడాన్ని నేను ఆస్వాదించేవాడిని. ఎందుకంటే నేను ఎదుర్కొన్న ఆఫ్ స్పిన్నర్లలో అతనే కఠినమైనవాడు. ముఖ్యంగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో అతని బౌలింగ్ ఆడటం చాలా కష్టం. దూస్రాతో కూడిన అతని బౌలింగ్ చాలా వేగంగా ప్రమాదకరంగా ఉండేది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మైదానంలో ఏ పాక్ ఆటగాడితో మాటల వాగ్వాదాన్ని ఆస్వాదించావని ప్రశ్నించగా.. గంభీర్ పరోక్షంగా షాహిద్ అఫ్రిది పేరు సూచించాడు. 'ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు.'అని సమాధానం ఇచ్చాడు. ఇక కరోనా బారిన పడిన అఫ్రిది త్వరగా కోలుకోవాలని గంభీర్ ఆకాంక్షించిన విషయం తెలిసిందే. తనకు అఫ్రిదితో రాజకీయ విభేదాలు ఉన్నాయని, కానీ అది వ్యక్తిగత వైరం మాత్రం కాదని చెప్పాడు.
ఇక మైదానంలో చాలా సార్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్న ఈ ఇద్దరూ.. రిటైర్మెంట్ అనంతరం కూడా ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడిన గంభీర్.. 4154, 5238, 932 పరుగులు చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.