Gautam Gambhir: భువనేశ్వర్‌కు రెస్ట్ ఇచ్చి.. అతనికి చోటివ్వాలి!

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగే నామమాత్రపు ఆఖరి టీ20లో టీమిండియాలో పలు మార్పులు చేయాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినిచ్చి యువ బౌలర్ల ఆవేశ్ ఖాన్‌కు చోటివ్వాలన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లను గెలిచి 2-0తో కైవసం చేసుకున్న రోహిత్ సేన.. నేడు(ఆదివారం) ఆఖరి మ్యాచ్‌కు రెడీ అయింది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో.. టీమిండియా రిజర్వ్ బెంచ్ సత్తాను పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గౌతమ్ గంభీర్ పలు సూచనలు చేశాడు.

ఆవేశ్ ఖాన్‌కు అవకాశమివ్వాలి..
'బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్‌ను తొలగించి ఆవేశ్ ఖాన్‌ను ప్రయత్నించొచ్చు. ఆ వికెట్ అతనికి సరిపోతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో పేస్, బౌన్స్‌కు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఈ మ్యాచ్‌లో నేను ఆవేశ్‌ను చూడాలనుకుంటున్నా. ఇప్పటికే సిరీస్ గెలిచిన పరిస్థితుల్లో అతనికి అవకాశం ఇచ్చి చూడాలి. అతను అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో గమనించాలి. అయితే.. ఈ మ్యాచ్‌ను అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఇందులోనూ విజయం సాధించి 3-0తో నిలవాలి. ఒత్తిడికి గురికావొద్దు' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల పూర్తయిన ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 24 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో ఆ టోర్నీలో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన అతను ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈరోజు అతన్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.

నీ పిల్లల్ని పంపించు..
పాకిస్థాన్ ప్రధానిని ఉద్దేశించి టీమీండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ స్పందించాడు. తన పిల్లల్ని బోర్డర్‌కు పంపాలని ఈ బీజేపీ ఎంపీ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సిద్ధూ తన పెద్దన్నగా సంబోధించిన నేపథ్యంలో గౌతీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ అండదండలతో చెలరేగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ 70 ఏళ్లుగా పోరాడుతుంటే.. దానికి సహకరిస్తున్న దేశాధినేతను పట్టుకొని 'పెద్దన్న'గా పేర్కొనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'నీ కుమారుడు లేదా కూతుర్ని బోర్డర్‌కు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఆ దేశాధినేతను పెద్దన్న అని పిలుచుకో. ఇది చాలా దారుణమైన విషయం' అని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బార్డర్ తెరవాలి..
పాకిస్థాన్ భూభాగంలోని కర్తార్‌పూర్ సాహిబ్‌ను శనివారం సందర్శించిన సిద్దూ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్‌ఖాన్ చొరవ వల్లే కర్తార్‌పుర్ నడవా తిరిగి తెరుచుకుందని, పంజాబ్ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వాణిజ్య కార్యకలాపాల కోసం రెండు దేశాల సరిహద్దులను తిరిగి తెరవాలని కోరారు. పంజాబ్ నుంచి పాకిస్థాన్‌కు 21 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు ముంద్రా పోర్టు మీదుగా 2,100 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్‌ఖాన్ తనకు పెద్దన్నయ్య లాంటి వారని సంబోధించారు. దీంతో దుమారం రేగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications