For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gautam Gambhir: సునీల్ నరైన్ ఇంకా ‘మిస్టరీ’ స్పిన్నరేనా?

Gautam Gambhir Lauds Sunil Narine For Match-Winning Spell Against RCB

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ వెటరన్ స్పిన్నర్, వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ నరైన్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు జల్లు కురిపించాడు. అతనో ప్రత్యేకమైన బౌలరని కొనియాడాడు. అయితే ఇంకా అతన్ని మిస్టరీ స్పిన్నరని అనడం తనను ఆశ్చర్యపరుస్తుందన్నాడు. మిస్టరీ అనే కంటే క్వాలిటీ అనే పదం ఎందుకు వాడరో అర్థం కావడం లేదన్నాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నరైన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ముందుగా బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో మూడు సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. దాంతో కేకేఆర్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు సిద్దమైంది.

ఈ మ్యాచ్ ఫలితంపై ఈఎస్‌పీఎన్ క్రిక్‌ ఇన్‌ఫో షో 'టీ20 టైమ్ ఔట్'లో మాట్లాడిన గంభీర్.. నరైన్ ఆటతీరును ప్రశంసించాడు. 'సునీల్‌ నరైన్‌ను ఇంకా మిస్టరీ బౌలర్ అని పిలవడం నన్ను ఆశ్చర్చపరుస్తోంది. మిస్టరీ అనే పదం కంటే క్వాలిటీ అనే పదం నరైన్‌కు ఎందుకు ఉపయోగించరో అర్థం కావడం లేదు. నరైన్‌ మిస్టరీ బౌలర్ అయితే ఇన్నేళ్ల పాటు క్రికెట్‌లో ఎలా కొనసాగుతున్నాడు. పైగా టాప్ బ్యాట్స్‌మన్ అయినటువంటి కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఎలా ఔటవుతున్నారు.

అనలిస్ట్‌ల సాయంతో అతని మిస్టరీ చేధించేవారు కాదా? ఇన్నేళ్లు ఎలా అతని బౌలింగ్‌లో కోహ్లీ, ఏబీడీ వెనుదిరిగారో ఇప్పుడు కూడా అలానే ఔట్‌ అయ్యారు. దీనిలో కొత్తేం ఉంది. నరైన్‌ బౌలింగ్‌లో ఆ ముగ్గురు ఇప్పటికీ ఆడలేకపోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. టాప్‌క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పంపగల సత్తా నరైన్‌కు ఉంది. కాబట్టి అతను కేవలం మిస్టరీ స్పిన్నరే కాదు. అంతకు మించి నాణ్యమైన బౌలర్'అని గంభీర్ పేర్కొన్నాడు. నరైన్‌ ప్లేఆఫ్స్‌ మెరిసిన రెండుసార్లు కేకేఆర్‌ టైటిల్ గెలవడం గమనార్హం.

ఇక మెగాటోర్నీలో కేకేఆర్‌ గంభీర్‌ కెప్టెన్సీలోనే రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. 2012, 2014లో టైటిల్‌ గెలిచిన గంభీర్‌ సేనలో సునీల్‌ నరైన్‌ కీలకపాత్ర పోషించాడు. 2012 సీజన్‌లో 24 వికెట్లు తీసిన నరైన్‌.. 2014 సీజన్‌లో 21 వికెట్లు తీశాడు. తాజా సీజన్‌లో(ఐపీఎల్‌ 2021) 14 వికెట్లతో వరుణ్‌ చక్రవర్తి తర్వాత కేకేఆర్‌ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇక కేకేఆర్‌ రేపు(బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్‌ 2 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు దసరా(అక్టోబర్ 15)రోజున చెన్నై సూపర్ కింగ్స్‌తో టైటిల్ పోరులో పాల్గొంటుంది.

Story first published: Tuesday, October 12, 2021, 22:08 [IST]
Other articles published on Oct 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+