గత కొంతకాలంగా పేలవమైన ఆటతీరుతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కుంటున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. వారి ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. రోహిత్, కోహ్లీలో ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదని, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు గౌతమ్ గంభీర్.. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలవ పామ్‌పై వస్తున్న విమర్శలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.

ఇటీవలే ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా గంభీర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై తమకు లేదని బాధ ఆయనకు ఎందుకని ప్రశ్నించాడు. అసలు భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని? అని నిలదీసాడు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదని చురకలంటించాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై తమకెలాంటి ఆందోళనా లేదని, వాళ్లిద్దరూ ఇప్పటికీ పరుగుల వేటలో బాగా ఆకలితో ఉన్నారని చెప్పాడు. గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్ శతకాలు మాత్రమే చేశాడని, అతని ఫామ్ ఆందోళన పరిచే విషయమేనని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ఇక పాంటింగ్‌ను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రెస్‌మీట్‌లో గంభీర్ వ్యవహరశైలిపై మంజ్రేకర్ ట్విటర్ వేదికగా స్పందించాడు.
'ఇప్పుడే గంభీర్ మీడియా సమావేశం చూశాను. ఇప్పటి నుంచి అతన్ని మీడియా సమావేశాలకు దూరం ఉంచడం బెటర్. తెర వెనుక పనిచేసుకోనివ్వండి. రోహిత్‌శర్మ, అజిత్ అగార్కర్.. హాజరుకావడం మంచిది'అని బీసీసీఐని ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చాడు.
నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను భారత్ 4-0తో గెలవాలి. గత రెండు ఆసీస్ పర్యటనల్లో భారత్ విజయం సాధించింది. దాంతో తాజా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.