టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్‌పై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సంజా శాంసన్ ఎంతో నైపుణ్యం కలిగిన ఆటగాడని కొనియాడాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇక సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డే కెరీర్‌ను ప్రారంభించిన 8 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ నమోదు చేశాడు. దాంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సంజూ సెంచరీపై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడాడు. ఈ సెంచరీతో సంజూ శాంసన్ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమవుతుందని అభిప్రాయపడ్డాడు.

'సంజూ శాంసన్ ఎంతో నైపుణ్యం కలిగిన ఆటగాడు.ఐపీఎల్‌లో అతను అసాధారణ ప్రదర్శనలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. సౌతాఫ్రికాపై సాధించిన తాజా సెంచరీ అతని అంతర్జాతీ ప్రయాణానికి ఆరంభంగా నిలవనుంది. ఈ సెంచరీతో సెలెక్టర్లపై ఒత్తిడి నెలకొననుంది. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉండనున్నాయో వేచి చూడాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం సంజూ శాంసన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సెంచరీ అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలవనుందని చెప్పాడు.

'సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. ఈ సెంచరీ అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవ్వనుంది. అతని టాలెంట్‌పై ఎవరికీ సందేహాలు లేవు. కానీ నిలకడ లేకపోవడమే అతన్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం అతని కెరీర్‌కు కలిసొస్తుంది.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్(114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108) సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. అర్ష్‌దీప్ సింగ్(4/30) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.