
రికార్డుల గురించి పట్టించుకోరు
తాజాగా గౌతమ్ గంభీర్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. ఇరు జట్లకు గెలిచేందుకు 50-50 అవకాశం ఉంది. పెద్ద టోర్నీల్లోని రికార్డులను కేవలం మీడియా మరియు అభిమానులు మాత్రమే పట్టించుకుంటారు. ఆటగాళ్లు అవేమి పట్టించుకోరు. రికార్డుల గురించి వారు అసలు ఆలోచించరు' అని అన్నాడు. 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను కివీస్ ఓడించింది. ఫిబ్రవరి 2020లో కివీస్ పర్యటనకు వెళ్లిన భారత్.. వన్డే మరియు టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా భారత్ ఓడిపోయింది. ఈ రికార్డులనే గౌతీ ప్రస్తావించాడు.

అంత సులభం కాదు
'వ్యక్తిగత రికార్డుల గురించి మీరు ఆలోచించవచ్చు. ఒక ఆటగాడు ఓ నిర్దిష్ట బౌలర్‌తో పోరాడుతుంటే.. అది అతని మనస్సులో బలంగా ఉంటుంది. కానీ టీమిండియాపై పాకిస్తాన్ ఎన్నడూ గెలవలేదు అలానే న్యూజిలాండ్‌పై భారత్ గెలవలేదు. రికార్డులు ఎప్పుడూ ముఖ్యం కాదు. టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ ఖచ్చితంగా న్యూజిలాండ్‌ను ఓడించగలదు. ఎందుకంటే మంచి జట్టు అందుబాటులో ఉంది. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ జట్టులో ఉన్నారు. మంచి బ్యాట్స్‌మెన్ మరియు బౌలర్లు ఉన్న టీమిండియాను ఓడించడం న్యూజిలాండ్‌కు అంత సులభం కాదు' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్ పైనా అంచనాలు ఉన్నాయి
'టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ పైనా అంచనాలు విపరీతంగా ఉంటాయి. కానీ వారితో పోలిస్తే.. భారత్ ఎన్నోరెట్లు మెరుగైన జట్టు. టీ20ల్లో ఎవర్ని ఎవరైనా ఓడించొచ్చు. ఎందుకంటే.. ఇది వ్యక్తిగత క్రీడ మాదిరిగానే ఉంటుంది. అందుకే ఏ జట్టునూ తక్కువ అంచనా వేయొద్దు. ఉదాహరణకు అఫ్గానిస్థాన్‌ను పసికూనగా భావించొద్దు. రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు సంచనాలు సృష్టించగలరు. పాకిస్థాన్ సైతం అలాంటిదే. కానీ వారిపై అంచనాలు అధికం' అని గంభీర్ తెలిపాడు. మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచులో పాక్‌తో తలపడుతున్న సంగతి తెలిసిందే.
ఈసారి టీ20 ప్రపంచకప్‌ని ఆ జట్టే గెలుస్తుంది: పాంటింగ్

అఫ్గానిస్థాన్ షాకులు ఇవ్వగలదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎదిగిన అఫ్గాన్ ఆటగాళ్లు ఏ జట్టుకైనా షాకులు ఇవ్వగలరని గౌతమ్ గంభీర్ అంటున్నాడు. 'ఈ టోర్నీలో మీరేదైనా జట్టును అండర్‌డాగ్‌గా గుర్తించమంటే.. నేను అఫ్గానిస్థాన్ పేరే చెప్తా. అంతేకాకుండా వారి జట్టులో రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
వారినంత తేలిగ్గా తీసుకోలేం. ఈ త్రయం ఎప్పుడైనా చెలరేగగలదు. బ్యాట్, బంతితో రాణించగల సామర్థ్యం వారి సొంతం' అని గౌతీ అంటున్నాడు. ప్రస్తుతం అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ క్రమంలోనే వారు ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సందిగ్ధతకు తెరదించుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ క్లారిటీ ఇచ్చింది. తమ జట్టు ఆటగాళ్లు టోర్నీలో ఆడుతారని స్పష్టం చేశాడు.

రసవత్తరమైన పోరాటాలు చూడొచ్చు
ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో కూడిన గ్రూప్-1లో రసవత్తరమైన పోరాటాలు చూడొచ్చని ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ అంచనా వేశాడు. 'ఇదే అసలైన గ్రూప్. ఇందులో నాలుగు బలమైన జట్లు ఉన్నాయి. అందుకే ప్రపంచకప్ 2021 ఆరంభమైన రోజు నుంచే గొప్ప పోరాటాలు ఉంటాయి. వెస్టిండీస్ ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం. విండీస్ జట్టులో అంతా టీ20 స్టార్లే ఉంటారు.
వారు మూడోసారి కప్ గెలిచినా ఆశ్చర్యం లేదు. ఇంగ్లండ్‌కూ అలాంటి ఆటగాళ్లే ఉన్నారు. రెండు మూడేళ్లుగా వారు పరిమిత ఓవర్ల క్రికెట్లో బాగా ఆడుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సైతం గెలిచారు. ఇక ఆస్ట్రేలియాపై ఎవరికీ అంచనాల్లేవు. కీలక ఆటగాళ్లు ఫామ్ అందుకోవాల్సి ఉంది. అయితే తనదైన రోజున అది ప్రమాదకరమైన జట్టే' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో
గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా, పాపువా ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి.
ఇక ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. 30న ఇంగ్లండ్, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది.


Click it and Unblock the Notifications
