టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు మరో చాపెల్‌లా తయారయ్యాడని విమర్శలు గుప్పిస్తున్నారు. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమిండియా ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా దారుణంగా విఫలమవుతుంది.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా బలహీనమై బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లపై మాత్రమే టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై సిరీస్‌ను కోల్పోయి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్‌ను సమం చేసుకున్న టీమిండియా.. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో గెలిచి హోమ్ సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. కానీ సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది.

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత ఓటమికి గంభీరే ప్రధాన కారణమని మెజార్టీ అభిమానులు భావిస్తున్నారు. అతని అనాలోచిత నిర్ణయాల వల్లే టీమిండియా ఓటమిపాలైందని అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సాయి సుదర్శన్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడాన్ని తప్పుబట్టారు. అంతేకాకుండా స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థికి ఉచ్చు బిగించాలనే గంభీర్ మైండ్‌సెట్ సరికాదని మండిపడుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఆడలేకనే న్యూజిలాండ్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ అయిందని, అయినా గంభీర్‌కు బుద్ది రాలేదని విమర్శిస్తున్నారు.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌కు టర్నింగ్ ట్రాక్ సిద్దం చేయించిన గంభీర్.. అందుకు తగ్గట్లుగానే నలుగురు స్పిన్నర్లతో టీమిండియాను బరిలోకి దించాడు. కానీ బ్యాటర్లు తేలిపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ ఓటమిని ఆటగాళ్లపైకి నెట్టేసిన గంభీర్.. తన నిర్ణయాలను సమర్థించుకున్నాడు. ఓపికగా బ్యాటింగ్ చేస్తే పరుగులు వచ్చేవని, ఈ పిచ్ బ్యాటర్ల సామర్థ్యానికి పరీక్షగా నిలిచిందని చెప్పుకొచ్చాడు.
ఇక స్పిన్ పిచ్‌లను పక్కనపెట్టి ఐదు రోజుల పాటు ఆట సాగే సమతూకమైన వికెట్లపై ఆడాలని సౌరవ్ గంగూలీ వంటి మాజీ ఆటగాళ్లు సూచిస్తుంటే.. గంభీర్ మాత్రం తన మొండి పట్టును వదలడం లేదు. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్‌కు కూడా టర్నింగ్ ట్రాక్‌నే రెడీ చేయమని గంభీర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ఎర్రమట్టితో కూడిన పిచ్‌ను సిద్దం చేశారని, తొలి రోజు నుంచే టర్నింగ్ లభిస్తుందని గంభీరే స్వయంగా వెల్లడించాడు. కాకపోతే కోల్‌కతా తరహాలో ఉండదని, పేస్, బౌన్స్ కూడా జనరేట్ అవుతుందన్నాడు.
అంతేకాకుండా పిచ్ గురించి చర్చ అనవసరమని, ఆటగాళ్ల నైపుణ్యాలే ముఖ్యమని తెలిపాడు. ఇరు జట్లు ఒకే పిచ్‌పై ఆడుతాయని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. దాంతో గంభీర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఈడు ఇక మారడు'అని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. సొంతగడ్డపై మరో క్లీన్‌స్వీప్, ఘోర పరాభావానికి మానసికంగా సిద్దం కావాలని అభిమానులకు పిలుపునిస్తున్నారు.