న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చోటు చేసుకున్న గొడవలో తన తప్పు ఏ మాత్రం లేదని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. అక్కడ ఎవరున్నా అలానే చేసేవాడినని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2023 సెకండాఫ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ-గంభీర్ మైదానంలోనే గొడవపడిన విషయం తెలిసిందే.
మ్యాచ్ సమయంలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్- కోహ్లీ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్దం గంభీర్‌తో గొడవకు దారి తీసింది. నవీన్ ఉల్ హక్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్.. కోహ్లీపైకి దూసుకెళ్లగా అతను కూడా ధీటుగా బదులిచ్చాడు. దాంతో ఉద్రిక్తతకు దారీ తీసింది. ఇరు జట్ల ఆటగాళ్లు సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా ఇది నిలిచిపోయింది.

ఈ వివాదంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న గంభీర్.. ఎట్టకేలకు స్పందించాడు. న్యూస్ 18 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటన గురించి మాట్లాడుతూ తన చర్యను సమర్థించుకున్నాడు.
'ధోనీ, విరాట్ కోహ్లీ మరే ఇతర ఆటగాడితోనైనా నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య ఏదైనా వివాదం చోటు చేసుకుంటే అది మైదానం వరకు మాత్రమే పరిమితం. వ్యక్తిగతంగా ఏమీ తీసుకోను. నాలాగే వాళ్లు కూడా గెలవాలని కోరుకుంటాను.
మైదానంలో వివాదాలు చోటు చేసుకున్నప్పుడు టీఆర్పీల కోసం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారు. చాలా మంది ఈ గొడవపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే అక్కడ ఏం జరిగిందనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో నేను చేసినదాంట్లో ఏ మాత్రం తప్పు లేదు. నవీన్ ఉల్ హక్ తప్పు చేయలేదని భావిస్తే.. అతని వెంట నిలబడటం నా బాధ్యత.
అక్కడ నవీన్ ఉల్ హక్ ఉన్నా.. మరే ఆటగాడు ఉన్నా నేను అలానే ప్రవర్తించేవాడిని. నా తత్వమే అది. విదేశి ఆటగాడికి ఎలా మద్దతు ఇస్తారని చాలా మంది విమర్శించారు. అతను మనవాడా కాదా? అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. తప్పు చేయలేదని భావిస్తే అండగా ఉంటాను.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా ఆ గొడవలో విరాట్ కోహ్లీదే తప్పని గంభీర్ తేల్చాడు.