భవిష్యత్తులో కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతోనే టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూరంగా ఉంచామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. బుమ్రా వంటి పేసర్ జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారని, అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అని కొనియాడాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
వెన్ను గాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతని గాయానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్స్ సరిగ్గానే ఉన్నా.. పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసే ఫిట్‌నెస్ సాధించలేదని టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. రిస్క్ చేయడం ఇష్టం లేకనే బుమ్రా లేకుండా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అవుతోంది.

భవిష్యత్తు మ్యాచ్‌ల కోసమే..
ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన అనంతరం గౌతమ్ గంభీర్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవ్వడంపై స్పందించాడు. 'జస్‌ప్రీత్ బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. అతను జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ, అన్ని మన చేతుల్లో ఉండవు. భవిష్యత్తులో బుమ్రా కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందుకే అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అంతకుమించి ఇతర విషయాలను వెల్లడించలేను.
కుర్రాళ్లకు మంచి అవకాశం..
అయితే బుమ్రా గైర్హాజరీ యువ పేసర్లకు మంచి అవకాశం. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాణిస్తారని ఆశిస్తున్నా. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఎవరైనా తమ వంత బాధ్యత తీసుకోవాలి. ఐసీసీ టోర్నీల్లో ఆడే అవకాశం అంత సులువుగా రాదు. ఇంగ్లండ్‌పై హర్షిత్ రాణా మెరుగైన ప్రదర్శన చేశాడు. కీలకమైన వికెట్లు తీసాడు. మహమ్మద్ షమీ వంటి సీనియర్ పేసర్ జట్టులో ఉండటం కలిసొచ్చే అంశం. అతను కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేస్తాడు. ఇది జట్టుకు అదనపు ప్రయోజనం.
అతనే మా కీపర్..
ప్రస్తుతం కేఎల్ రాహుల్ మా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్. రిషభ్ పంత్‌కు ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చు. రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, ఇద్దర్నీ ఆడించలేని పరిస్థితి. ఐదో స్థానంలోనే రాహుల్‌ను ఆడిస్తారా? అంటే కచ్చితంగా చెప్పలేను. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బ్యాటర్ల సగటు, రికార్డ్స్‌లను పరిశీలించలేం.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఫిబ్రవరి 19న పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. భారత మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.