టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. సూర్య పేలవ ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. దూకుడుగా ఆడాలనేది జట్టు నిర్ణయమని, ఆ ప్రయత్నంలోనే సూర్య విఫలమవుతున్నాడని వివరణ ఇచ్చాడు.
ఈ ఏడాది 11 టీ20లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 11.11 సగటుతో 100 పరుగులు మాత్రమే చేశాడు. గత 7 మ్యాచ్‌ల్లో సూర్య 72 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచినా.. బ్యాటర్‌గా సూర్య నిరాశపర్చాడు. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ మునపటిలా ఆడలేకపోతున్నాడని, జట్టుకు భారంగా మారాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ లేకుంటే సూర్యకు తుది జట్టులో చోటు దక్కేది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం కాన్‌బెర్రా వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో సూర్య ఫామ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ సిరీస్‌లో తప్పకుండా సూర్య రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

'నిజాయితీగా చెప్పాలంటే సూర్య బ్యాటింగ్ ఫామ్‌పై నాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే దూకుడైన బ్యాటింగ్ అప్రోచ్‌ను కొనసాగించాలని మేం జట్టుగా నిర్ణయించుకున్నాం. ఈ అప్రోచ్‌ను అనుసరించినప్పుడు వైఫల్యాలు కూడా ఎదురవుతాయి. 30 బంతుల్లో 40 పరుగులు చేయడం సూర్యకు పెద్ద కష్టం. అలా చేసి విమర్శల నుంచి తప్పించుకోవచ్చు. కానీ మేం అలా చేయలనుకోవడం లేదు. వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టు విజయానికే ప్రాధాన్యత ఇస్తున్నాం.
దూకుడుగా ఆడి వైఫల్యం ఎదురైనా అంగీకరించాలని కలిసికట్టుగా నిర్ణయించాం. ఆసియా కప్‌లో అభిషేక్ అద్భుతంగా ఆడాడు. అతను ఇదే జోరును ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నాం. సూర్య కూడా టచ్‌లోకి వస్తే అతను మరింత బాధ్యత తీసుకుంటాడు. సూర్య గొప్ప వ్యక్తి. మంచి మనుషులే మెరుగైన నాయకులవుతారు. ఈ జట్టు తనది. ఆటను గమనించి అతనికి సరైన సలహాలు ఇవ్వడమే కోచ్‌గా నా పని.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తనకు మరో పెద్ద సవాల్ అని గంభీర్ ఇన్‌స్టాలో పేర్కొన్నాడు.