న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చినంత మాత్రానా ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టవద్దని తెలిపాడు. రాహుల్ కోసం కోహ్లీ, రోహిత్ శర్మలను పక్కనపెడతారా? అని ప్రశ్నించాడు. ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసిన రాహుల్.. జట్టుతో కలిసాడు.
రాహుల్ రాకతో ఇషాన్ కిషన్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గంభీర్.. ఆటగాళ్ల పేర్ల కన్నా ఫామ్ ముఖ్యమని తెలిపాడు. 'జట్టులో చోటు కోసం ఎంత శ్రమించాలో ఇషాన్ కిషన్ అంత కంటే ఎక్కువే శ్రమిస్తున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదని ఇషాన్ కిషన్‌కు బదులు కేఎల్ రాహుల్‌ను ఆడిస్తామనడం సరికాదు. ఒకవేళ విరాట్ కోహ్లీ లేదంటే.. రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ స్థానంలో ఉండి ఉంటే.. కేఎల్ రాహుల్ కోసం వారిని పక్కనపెట్టేవారా?
భారత్‌కు టైటిల్ గెలవడం ముఖ్యం. ఇందుకోసం ఆటగాళ్ల ఫామ్ ముఖ్యమా? పేర్లు ముఖ్యమా? ఒక వేళ కోహ్లీ, రోహిత్ వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన తర్వాత రాహుల్ కోసం పక్కనపెట్టేవారా? ప్రపంచకప్‌కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆటగాళ్ల పేర్లతో మనకు పనిలేదు. వాళ్ల ఫామ్ ఎలా ఉందన్నదే కీలకం. టీమ్‌కు ప్రపంచకప్ అందించగల సత్తా ఉన్న ఆటగాడి వైపే మనం మొగ్గు చూపాలి.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఫిట్‌నెస్ సమస్యలతో కేఎల్ రాహుల్ ఆసియాకప్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్.. పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడిలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టును ఆదుకున్నాడు.
ఈ మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్.. పాక్‌తో మ్యాచ్‌లో సాధించిన ఫిఫ్టీతో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను రాహుల్ కోసం పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.