మోహ్‌సిన్ నఖ్వీ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అతి జోక్యంతోనే హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశానని గ్యారీ కిర్‌స్టన్ తెలిపాడు. కోచ్‌గా తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని ఆరోపించాడు. రెండేళ్ల క్రితం(2024) పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కోచ్‌గా రెండేళ్ల ఒప్పందంతో గ్యారీ కిర్‌స్టన్ బాధ్యతలు చేపట్టాడు. కానీ 6 నెలల వ్యవధిలోనే తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ప్రారంభానికి కేవలం 6 రోజుల ముందు కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కిర్‌స్టన్ స్థానంలో జేసన్ గిలేస్పీ తాత్కలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కానీ అతను కూడా కొద్ది నెలల్లోనే రాజీనామా చేయడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజీనామాకు గల కారణాలను కిరస్టన్ వెల్లడించాడు. పీసీబీపై నిప్పులు చెరిగాడు. 'నేను నా కెరీర్‌లో ఎక్కడా చూడని విధంగా పాక్ క్రికెట్ బోర్డు జట్టు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. బయటి వ్యక్తుల ఒత్తిడి మధ్య ఆటగాళ్లతో కలిసి పని చేయడం ఒక కోచ్‌కి నరకంలా ఉంటుంది. జట్టు ఓడిపోయిన ప్రతిసారీ ప్లానింగ్‌లో లోపాలను వెతకకుండా.. కోచ్‌లను బాధ్యులను చేసి వారిని తొలగించడం లేదా కఠినమైన ఆంక్షలు విధించడం పీసీబీకి అలవాటుగా మారింది.
జట్టు పేలవ ప్రదర్శనకు కోచ్‌లను బాధ్యులను చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కోచ్‌లకు కనీస గౌరవం, నిర్ణయాధికారం లేని అస్థిరమైన వాతావరణం వల్లనే నేను కోచ్ పదవికి రాజీనామా చేశాను. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే తప్పుకున్నాను.’అని కిరస్టన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 హడావుడి నడుస్తున్న తరుణంలో కిర్‌స్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ క్రికెట్ వేదికపై పాకిస్థాన్ పరువును తీశాయి.
గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లోనూ సెమీస్ చేరకుండా ఇంటిబాట పట్టింది. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను కూడా పాకిస్థాన్ 1-2తో కోల్పోయింది. గ్యారీ కిర్‌స్టన్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది.