మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజయంతో మగువల క్రికెట్‌కు దేశంలో ఆదరణ అమాంతం పెరిగింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించడంతో భారత మహిళల క్రికెట్ బ్రాండ్ వాల్యూ 25 నుంచి 100 శాతానికి ఎగబాకింది. ఈ క్రమంలోనే మిక్స్‌డ్ క్రికెట్ అనే అంశం తెరపైకి వచ్చింది. సమీప భవిష్యత్తులో టెన్నిస్, బ్యాడ్మింటన్ తరహాలోనే క్రికెట్‌లో కూడా మిక్స్‌డ్ టోర్నీలు పురుడు పోసుకునే అవకాశం ఉంది.
మహిళలు, పురుషుల క్రికెటర్లు కలిసి ఆడితే అద్భుతంగా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా, షెఫాలీ వర్మ బ్యాటింగ్ చేసే ఊహనే ఆనందాన్నిస్తోందని, మిక్స్‌డ్ టోర్నీ నిర్వహిస్తే ఆటకు మరింత ప్రాచుర్యం పెరుగుతుందని, కనీసం టీ20 ఫార్మాట్‌లోనైనా ఇలా ఆడించాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

అయితే మరికొందరు క్రీడా ప్రేమికులు మాత్రం.. టీమ్ క్రీడల్లో మిక్స్‌డ్ ఈవెంట్ కుదరదని ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో స్మృతి మంధాన బ్యాటింగ్ చేయగలదా? ఆ వేగాన్ని తట్టుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మహిళల క్రికెట్ ఎంత ఎదిగినా.. పురుషుల క్రికెట్ స్థాయిలో రాణించలేరని అభిప్రాయపడుతున్నారు.
ఆడవారు శక్తి స్వరూపులని, వారు సాధించలేనిది అంటూ ఏదీ లేదని, భవిష్యత్తులో పురుష క్రికెటర్లకు ధీటుగా ఆడుతారని మరికొందరు ధీటుగా బదులిస్తున్నారు. గతంలో భారత మహిళా క్రికెటర్లను ఇలానే ఎగతాళి చేశారని, కానీ వారు అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ ఛాంపియన్లుగా నిలిచారని గుర్తు చేస్తున్నారు. క్రికెట్ అందరి ఆట అని, పురుషుల ఒక్కరి సొత్తే కాదని కూడా కామెంట్ చేస్తున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్.. పురుషుల క్రికెట్ కంటే మెరుగ్గా ఉందని గుర్తు చేస్తున్నారు.
మహిళల క్రికెట్‌లో ఐసీసీ అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మిక్స్‌డ్ క్రికెట్ తెరపైకి రావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. కోహ్లీ, రోహిత్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ఒకే జట్టులో ఉండి.. పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది వంటి ప్రత్యర్థి బౌలర్లను చితక్కొడితే చూడ ముచ్చటగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.