మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తొలి ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2005, 2017లో తృటిలో చేజారిన కప్‌ను ఈ సారి ఏ తప్పిదం చేయకుండా ఒడిసి పట్టుకుంది. ఫైనల్ ఒత్తిడిని చిరునవ్వుతూ ఛేదిస్తూ తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికాను మట్టికరిపించింది. 1983 ప్రపంచకప్ విజయం భారత్‌లో క్రికెట్ క్రేజ్‌ను పెంచితే.. అమ్మాయిల తాజా విజయం మగువల క్రికెట్‌కు ఆదరణ పెంచనుంది.
ఇప్పటికే భారత మహిళల క్రికెట్ బ్రాండ్ వాల్యూ 25 నుంచి 100 శాతానికి పెరిగింది. నెటిజన్లు కూడా టీమిండియా మహిళల తదుపరి షెడ్యూల్ గురించి ఆరా తీస్తున్నారు. మరో 7 నెలల్లో మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం టీమిండియా సన్నదం కానుంది.

ప్రపంచకప్ విజయంతో భారత మహిళల జట్టుకు నెలరోజుల సుదీర్ఘ విరామం లభించనుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగే మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్‌తో హర్మన్‌సేన మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. డిసెంబర్‌లో ఈ సిరీస్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి-ఫిబ్రవరి 2026 మధ్య వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్ జరగనుంది.
ఈ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెలాఖరులో జరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9వరకు సాగనుంది. మేలో భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ట్రై సిరీస్ జరగనుంది. మే 2026లో జరగనున్న ఈ ముక్కోణపు సిరీస్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12 నంచి జూలై 2026 మధ్య ఇంగ్లండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవలేదు. 2020లో ఫైనల్, 2009, 2010, 2018, 2023లో సెమీఫైనల్లో భారత్ వెనుదిరిగింది. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో కలిసి భారత్ గ్రూప్-ఏ ఉంది. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే ఏడాది మహిళల ఆసియా కప్ కూడా జరగనుంది. కానీ ఇంకా షెడ్యూల్ ఖరారు చేయలేదు.