గుణతిలక ఒక్కడే కాదు.. ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ రూల్‌కు బలైన వారు చాలానే ఉన్నారు!

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలక (61 బంతుల్లో 7 ఫోర్లతో 55) అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా ఔటవ్వడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొలార్డ్ వేసిన 21.1 ఓవర్‌కు గుణతిలక డిఫెన్స్ ఆడగా, బంతి అతడి కాళ్ల వద్దే ఆగిపోయింది.
అది గమనించకుండా ముందుకు వచ్చిన అతను.. పొలార్డ్ రనౌట్ చేయడానికి వస్తున్నట్లు గమనించి వెనక్కి పరుగెత్తాడు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా బంతిని కాలితో తనన్నాడు. తనను బంతి తీసుకోకుండా అడ్డుకున్నాడని, ఇది నిబంధనలకు విరుద్దమని పొలార్డ్ అప్పీల్ చేయగా.. థర్డ్ అంపైర్ పలుకోణాల్లో ఆ వీడియోను పరిశీలించి ఔటిచ్చాడు.
ఇక క్రికెట్ నిబంధనల ప్రకారం ఎవరైనా బ్యాట్స్‌మెన్ ఉద్దేశపూర్వకంగా తమ మాటలతో లేదా, చేష్టలతో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు అడ్డంకులు సృష్టిస్తే ఆ బ్యాట్స్‌మెన్‌ను అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా పరిగణిస్తూ ఔటిస్తారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక బ్యాట్స్‌మన్ ఔటిచ్చారు.
అయితే, గుణతిలక అనుకోకుండా బంతిని తన్నాడని, ఉద్దేశపూర్వకంగా కాదని నెటిజెన్లు మండిపడుతున్నారు. అతన్ని ఔటివ్వాల్సింది కాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అయితే అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఓ బ్యాట్స్‌మెన్ ఔటవ్వడం ఇదే తొలిసారి కాదు. మూడు ఫార్మాట్లలోనూ ఈ తరహా పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఒకసారి వాటిపై లుక్కెద్దాం!

టెస్ట్‌ల్లో ఒక్కసారే..
ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఒకసారి అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ కింద బ్యాట్స్‌మన్ ఔటయ్యాడు. అది కూడా 1951లో సౌతాఫ్రికాతో ఓవల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, బ్యాటింగ్ గ్రేట్ లెన్ హట్టన్ ఈ విధంగా ఔటయ్యాడు. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్‌లో ఇదే మొదిటిది, చివరిది కూడా.

వన్డేల్లో 8 సార్లు..
వన్డే క్రికెట్‌లో తాజా గుణతిలక ఘటనతో సహా మొత్తం 8 సార్లు అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ నిబంధన కింద బ్యాట్స్‌మన్ ఔటయ్యారు. 1987లో ఇంగ్లండ్‌తో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ ప్లేయర్ రమీజ్ రాజా వన్డేల్లో తొలిసారి ఈ నిబంధన కింద వెనుదిరిగాడు. 1989లో అహ్మదాబాద్ వేదికగా శ్రీలంక తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్ అబ్ స్ట్రకింగ్ ది ఫీల్డ్ కింద పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత 2006లో భారత్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్ ఉల్ హక్, 2013లో డర్బన్‌తో పాకిస్థాన్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్, అదే ఏడాది సౌతాఫ్రికాతో పాకిస్థాన్ ప్లేయర్ అన్వర్ అలీ, 2015లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, 2019లో యూఏఈతో యూఎస్‌ఏ ప్లేయర్ గ్జెవియర్ మార్షల్ ఈ తరహా నిబంధనతో పెవిలియన్ బాట పట్టారు.

టీ20ల్లో రెండు సార్లే...
అంతర్జాతీయ టీ20ల్లో ఇద్దరే బ్యాట్స్‌మెన్ అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ నిబంధనకు బలయ్యారు. 2017లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్, 2019లో మస్కట్‌తో జరిగిన మ్యాచ్‌లో మాల్దీవులు ఆటగాడు రషీద్ ఈ ఫీల్డింగ్ నిబంధనకు వెనుదిరిగారు.

ఐపీఎల్లోనూ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ బ్యాట్స్‌మెన్ ఈ తరహా నిబంధనతో పెవిలియన్ బాట పట్టారు. 2013 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్.. పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్లను అడ్డుకొని అప్పనంగా వికెట్ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అబ్ స్ట్రకింగ్ ద ఫీల్డ్ నిబంధన కింద వెనుదిరిగాడు. భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ ఈ తరహా నిబంధనకు బ్యాట్స్‌మెన్ మూల్యం చెల్లించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications