టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. టీవీ రిప్లే చూయించకుండా తనను చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నా ముఖంలో ఏం ఉందిరా అయ్యా.. రిప్లే చూపించు'అని సైగలు చేశాడు. అంతటితో ఆగకుండా రివ్యూ వృథా కావడంపై సహచర ఆటగాళ్లపై మండిపడ్డాడు. 'చెప్తే వినరూ'అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
రవీంద్ర జడేజా వేసిన 60వ ఓవర్ మూడో బంతికి బెన్ ఫోక్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో జడేజా రివ్యూ కోసం కెప్టెన్ రోహిత్ శర్మను ఒత్తిడి చేశాడు. రివ్యూ తీసుకునేందుకు రోహిత్ శర్మ సుముఖంగా లేడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సైతం రివ్యూ తీసుకోవాలని పట్టుబట్టడంతో రోహిత్ డీఆర్‌ఎస్ కోరాడు. అయితే బంతిని వికెట్లను మిస్సవుతుందని రోహిత్.. వివరించాడు. అయినా జడేజా, జురెల్ వినిపించుకోలేదు.

ఈ క్రమంలోనే టీవీ కెమెరామెన్ రిప్లే చూయించకుండా రోహిత్ వైపు కెమెరా పెట్టాడు. అప్పటికే కోపంగా ఉన్న రోహిత్.. కెమెరామెన్‌పై కస్సుమన్నాడు. తనను ఎందుకు చూపిస్తున్నావ్? అని సైగలు చేశాడు. రిప్లేలో రోహిత్ చెప్పినట్లే బంతి వికెట్లను మిస్సైంది. దాంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్.. 'చెబితే వినరూ'అంటూ మండిపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆకాశ్ దీప్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. సూపర్బ్ బౌలింగ్‌తో టాప్-3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. అతనికి ధాటికి బెన్ డక్కెట్(11), ఓలిపోప్(0), జాక్ క్రాలీ(42) పెవిలియన్ బాట పట్టారు. ఆ వెంటనే జానీ బెయిర్ స్టో(38)ను అశ్విన్, బెన్ స్టోక్స్(38)ను అశ్విన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెన్ ఫోక్స్‌తో కలిసి జో రూట్ జట్టును ఆదుకున్నాడు. బజ్‌బాల్ అప్రోచ్‌కు గుడ్‌బై చెప్పి.. తన సహజ శైలిలో బ్యాటింగ్ చేశాడు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవుతూ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. గత మ్యాచ్‌ల మాదిరి ఎలాంటి నిర్లక్ష్యపు షాట్లు ఆడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. దాంతో రెండో సెషన్‌లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఆరో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని సిరాజ్ విడదీసాడు. క్రీజులోకి వచ్చిన టామ్ హార్ట్‌లీ(1 బ్యాటింగ్) సాయంతో జోరూట్(76 బ్యాటింగ్) శతకం దిశగా సాగుతున్నాడు.