భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 'క్రికెటర్ ఆఫ్ ఇయర్' అవార్డుకు టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో శుభ్‌మన్ గిల్ ఈ పురస్కారం అందుకోనున్నాడని జాతీయ మీడియా పేర్కొంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన భారత జట్టులో లేకపోయినా.. టెస్ట్, వన్డే ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్ నిలకడైన ప్రదర్శనతో పరుగుల మోత మోగించడంతో ఈ అవార్డుకు ఎంపికైనట్లు తెలుస్తోంది.
2024-25 సీజన్‌లో టెస్ట్‌ల్లో శుభ్‌మన్ గిల్ 983 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో 70 సగటుతో ఏకంగా 754 రన్స్ చేశాడు. వన్డేల్లో 490 పరుగులు సాధించిన గిల్.. ఛాంపియన్స్ ట్రోఫీలో 188 పరుగులతో సత్తా చాటాడు. మొత్తం మీద ఈ రెండు ఫార్మాట్లలో గిల్ 49 సగటుతో రన్స్ చేశాడు.

ఇందులో ఏడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ గెలిచిన 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో గిల్ 188 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో శుభ్‌మన్ గిల్ విఫలమైనా.. ఐపీఎల్‌లో మాత్రం దుమ్మురేపాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున 50 సగటుతో 650 రన్స్ చేశాడు.
శుభ్‌మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికవ్వడం ఇది రెండోసారి. 2022-23 సీజన్‌లో కూడా అతనికి ఈ అవార్డ్ దక్కింది. రోహిత్ శర్మ వారసుడిగా టెస్ట్,వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న శుభ్‌మన్ గిల్.. జట్టును అద్భుతంగా నడిపించాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు.
2024 టీ20 ప్రపంచకప్‌ను గెలిపించడంతో పాటు భారత క్రికెట్‌కు చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డును ప్రకటించారు. అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన ఆయుష్ మాత్రేకు బెస్ట్ డొమెస్టిక్ ఆల్‌రౌండర్ అవార్డు దక్కనుంది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఉత్తమ అసోసియేషన్ అవార్డు దక్కనుంది.