భయ్యా.. గుండెలను పిండేసే టాప్-5 క్రికెట్ మూవీస్ ఇవే
భారత్‌లో క్రికెట్, సినిమా కేవలం వినోద సాధనాలు మాత్రమే కాదు.. కోట్ల మందికి అదొక ఎమోషన్. క్రికెట్‌ను మతంలా భావించే ఈ దేశంలో సినిమాలకు కూడా అదే స్థాయిలో జనాలు పట్టం కడుతారు. క్రికెట్, సినిమాలకు భారత్‌లో ఉన్నంత క్రేజ్ మరే దేశంలో ఉండదంటే అతిశయోక్తి కాదు.
అలాంటిది ఈ రెండు ఒకటైతే.. అభిమానులకు పండుగే. ఇలా క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఐదు ఉత్తమ క్రికెట్ సినిమాల గురించి తెలుసుకుందాం
1. లగాన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'లగాన్' భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. బ్రిటీష్ పాలన కాలం నాటి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో.. పన్ను (లగాన్) మాఫీ కోసం గ్రామీణ ప్రజలు బ్రిటీష్ అధికారులతో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది.
క్రికెట్ రాకపోయినా.. పట్టుదలతో ఆట నేర్చుకుని వారు సాధించిన విజయం ప్రేక్షకుల్లో దేశభక్తిని, ఉద్వేగాన్ని నింపుతుంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల రేసులో 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం' విభాగంలో నామినేట్ అయి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తే జనాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈ సినిమా జనాల్లో ఎంత పాపులర్ అయ్యిందంటే.. తమ క్రికెట్ టీమ్స్‌కు లగాన్ అని పేరు పెట్టుకునేంత ఆదరణ పొందింది.

2. ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ
భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఒక సాధారణ రైల్వే టీటీఈ స్థాయి నుంచి ప్రపంచకప్ గెలిచిన లెజెండ్‌గా ధోనీ ఎదిగిన తీరును దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒదిగిపోయి నటించారు.
హెలికాప్టర్ షాట్స్, ధోనీ వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలు, 2011 ప్రపంచకప్ ఫైనల్ విన్నింగ్ సిక్స్ వంటి సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. యువతకు ఈ చిత్రం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పాన్ ఇండియా చిత్రంగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది.
3. జెర్సీ
టాలీవుడ్ హీరో నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'జెర్సీ' తెలుగులో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత.. కొడుకు కోరిక కోసం, తన స్వీయ గౌరవం కోసం తిరిగి క్రికెట్ బ్యాట్ పట్టిన ఒక విఫల క్రికెటర్ అర్జున్ కథ ఇది.
ఈ సినిమాలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. తండ్రీకొడుకుల బంధానికి, ఒక మనిషి పోరాట పటిమకు ప్రతీక. అనిరుధ్ అందించిన సంగీతం, నాని నటన ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
4. 83
1983లో లార్డ్స్ మైదానంలో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి.. అజేయమైన వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి ప్రపంచకప్ గెలిచిన చారిత్రాత్మక ఘట్టాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. రణవీర్ సింగ్ కపిల్ దేవ్‌గా అద్భుత నటనను కనబరిచారు.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. అప్పట్లో భారత క్రికెట్ జట్టు ఎదుర్కొన్న అవమానాలు, వసతుల లేమిని అధిగమించి ప్రపంచ విజేతలుగా ఎదిగిన తీరును ఎంతో ఎమోషనల్‌గా చూపించింది. నాటి తరం క్రికెట్ అభిమానులకు ఇది ఒక గొప్ప జ్ఞాపకం లాంటి సినిమా.
5. ఇక్బాల్
కమర్షియల్ హంగులకు దూరంగా.. కేవలం కంటెంట్‌తో జనాల హృదయాలను గెలుచుకున్న చిన్న సినిమా 'ఇక్బాల్'. మూగ, చెవుడు ఉన్న ఒక పేద గ్రామీణ యువకుడు (శ్రేయాస్ తల్పాడే) భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలనే బలమైన కలని ఎలా నిజం చేసుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం.
మద్యానికి బానిసైన ఒక మాజీ క్రికెటర్ (నసీరుద్దీన్ షా) అతనికి కోచ్‌గా మారి అండగా నిలుస్తాడు. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైకల్యం ఉన్నా, సరైన ప్రతిభ, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని నిరూపించే ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక చిత్రం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications