మహిళల క్రికెట్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దాంతో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాలుగా గుండెలను పిండేస్తున్న ఆవేదనకు విముక్తి లభించింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికా 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఈ విజయంలో మన తెలుగు బిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి కూడా భాగమైంది. అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 21 ఏళ్ల శ్రీ చరణి అరంగేట్ర ప్రపంచకప్‌లోనే టాప్-5 బౌలర్‌గా నిలిచింది. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ ప్రదర్శన(3/41). దీప్తి శర్మ(19) తర్వాత భారత తరఫున సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచింది.
ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేయడం ఆమె ప్రత్యేకత. ఆమె ప్రభావం భారత జట్టుపై ఎంతలా ఉందంటే.. ఫైనల్లో శ్రీచరణిపైనే హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఓ దశలో టీమిండియా స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ కూడా చేతులెత్తేసింది. కానీ శ్రీచరణి కట్టడిగా బౌలింగ్ చేసింది. డాట్ బాల్స్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచింది. అనేక బోష్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన తీరు అద్భుతం. 21 ఏళ్ల వయసులోనే ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి శ్రీ చరణి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి అనూహ్యంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. తొలుత ఆమె ఖోఖోలో జాతీయస్థాయిలో రాణించింది. అథ్లెటిక్స్‌లోనూ అవకాశం అందుకుంది. కానీ పదోతరగతి చదువుతున్న సమయంలో క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఈ ఆటను కెరీర్‌ను ఎంచుకుంది. ముందుగా తన నిర్ణయాన్ని తండ్రి చంద్రశేఖర రెడ్డి, తల్లి రేణుక వ్యతిరేకించారు. కానీ కూతురు పట్టుదల చూసి ఆ దిశగా ప్రోత్సహించారు.
తన మామయ్య సహకారంతో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న శ్రీ చరణి.. మగ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడటం ప్రారంభించింది. పదో తరగతి తర్వాత క్రికెట్‌లో శిక్షణ తీసుకోవటం ప్రారంభించింది. ముందుగా పొద్దటూర్‌లో శిక్షణ తీసుకున్న శ్రీ చరణి.. ఆ తర్వాత హైదరాబాద్ కూకట్‌పల్లిలో రంజీ మాజీ క్రికెటర్ సురేష్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకుంది. మొదట్లో పేస్ బౌలర్ అయిన శ్రీ చరణి.. కోచ్ సురేష్ సూచనలతో ఆఫ్ స్పిన్నర్‌గా మారింది. ఆ సమయంలోనే అండర్ 19 జట్టుకు ఎంపికైంది.
తృటిలో అండర్ 19 ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ తర్వాత అండర్-23 స్థాయిలో తనదైన ప్రతిభ చూపింది. ఆంధ్ర టీమ్ తరఫున బరిలోకి దిగింది. 2023లో ముంబై వేదికగా జరిగిన టీ20 చాంపియన్‌షిప్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో శ్రీ చరణి ఆటను గమనించిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కౌట్స్.. డబ్ల్యూపీఎల్ వేలంలో రూ. 55 లక్షలకు కొనుగోలు చేశారు. డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో ముంబైపై శ్రీచరణి అదరగొట్టడంతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో 9 వికెట్లు పడగొట్టడంతో తొలుత వన్డే, ఆతర్వాత టీ20ల్లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. గత జూన్‌లో ఇంగ్లండ్‌తో అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో కెరీర్ బెస్ట్ గణంకాలు నమోదు చేసింది. ఈ ప్రదర్శనతో వెనక్కి తిరుగు చూసుకోలేదు. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 1983 పురుషుల వరల్డ్ కప్ విజయానికి సమానంగా మన అమ్మాయిల రాత మార్చే అరుదైన ఘట్టంలో ఈ కడప బిడ్డ భాగమైంది. బహుషా ఈ విజయం కోసమే ఆమె ఖోఖోను వదిలి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుందేమో..!