శ్రీలంక మాజీ క్రికెటర్ మార్వన్ ఆటపట్టు జీవితం మనందరికీ ఒక పాఠం. కెరీర్‌లో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా.. వెక్కిరింపులకు గురైనా పట్టు వదలుకుండా ఆట పట్టు అనుకున్నది సాధించాడు. 1990లో శ్రీలంక తరఫున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆటపట్టు తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటయ్యాడు.
ఈ వైఫల్యంతో జట్టు నుంచి వేటుకు గురయ్యాడు. కానీ ఆటపట్టు ఏ మాత్రం నిరాశకు గురవ్వలేదు. నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తూ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల మోత మోగించాడు. దాంతో 21 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతనికి మళ్లీ శ్రీలంక జట్టులో అవకాశం దక్కింది. కానీ మళ్లీ అదే వైఫల్యం అతన్ని వెంటాడింది.
రీఎంట్రీలో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఆట పట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. దాంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. అయినా అతను ఏ మాత్రం నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో ప్రాక్టీస్ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో మెరుగ్గా రాణించడంతో 17 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అతనికి మళ్లీ శ్రీలంక తరఫున ఆడే అవకాశం వచ్చింది.

ఈ సారి ఆటపట్టు ఖచ్చితంగా రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆటపట్టు డకౌట్‌గా వెనుదిరిగాడు. అతని పేలవ ప్రదర్శనతో సెలెక్టర్లు కూడా విసిగిపోయారు. ఇతనికి బిగ్ మ్యాచ్ టెంపర్‌మెంట్ లేదని భావించారు. ఆట పట్టు స్థానంలో ఎవరూ ఉన్నా ఆటను వదిలేసి మరో కెరీర్‌ను ఎంచుకునేవారు. కానీ మార్వన్ ఆట పట్టు మాత్రం అలా చేయలేదు. క్రికెటర్‌గా సత్తా చాటాలనే తన లక్ష్యాన్ని వదిలేయలేదు. మరింత కష్టపడి ఆటను మెరుగుపర్చుకున్నాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ అతనికి శ్రీలంక తరఫున ఆడే అవకాశం దక్కింది.
ఈ సారి మాత్రం ఆటపట్టు అదగొట్టాడు. 1997లో భారత్‌తో మోహాలి వేదికగా జరిగిన టెస్ట్‌లో ఆట పట్టు తొలి సెంచరీ నమోదు చేశాడు. 17 ఇన్నింగ్స్‌ల నిరీక్షణ తర్వాత ఆటపట్టుకు తొలి సెంచరీ దక్కింది. ఈ సెంచరీ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. అసాధారణమైన ఆటతో శ్రీలంక కెప్టెన్‌గా ఎదిగాడు. సారథిగా 2004లో ఆసియా కప్ కూడా అందించాడు.
ఓవరాల్‌గా శ్రీలంక తరఫున 90 టెస్ట్‌లు ఆడి 5502 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 268 వన్డేల్లో 8529 రన్స్ నమోదు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరుస వైఫల్యాలకు నిరాశ చెంది ఆటపట్టు క్రికెట్‌ను వదిలేస్తే ఈ సక్సెస్ సాధించలేకపోయేవాడు.
అతని కెరీర్‌ను సరిగ్గా గమనిస్తే.. తొలి 6 ఇన్నింగ్స్‌ల్లో 5 డకౌట్లు ఉంటే.. కెరీర్‌లో రెండో పరుగు చేసేందుకు 6 ఏళ్ల సమయం పట్టింది. ఎన్నిసార్లు వైఫల్యం ఎదురైనా.. తనకు నచ్చిన ఆటను, లక్ష్యాన్ని వదిలేయలేదు. వేరే కెరీర్ చూసుకోలేదు. తనపై నమ్మకం ఉంచి ముందుకు సాగాడు.
మార్వన్ కథ చెబుతున్న పాఠం ఏంటంటే.. వైఫల్యం తాత్కాలికం, కష్టం శాశ్వతం. ఓటమి అనేది అంతం కాదు.. అది మరోపాఠానికి ఆరంభం. ఎన్నిసార్లు పడిపోయినా.. మళ్లీ లేచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మార్వన్ పడిపోయిన ప్రతీసారి మరింత బలంగా లేచాడు.