
టాస్ ఓడిపోవడం..
ఈ బిగ్ మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ తనకు అలవాటైన రీతిలోనే టాస్ ఓడిపోయాడు. ఇది టీమ్ ఫలితాన్ని శాసించింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. కోహ్లీ సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగే ఎంచుకునేవాడినని స్పష్టం చేశాడు.
కానీ లక్ కోహ్లీకి ఫేవర్ చేయలేదు. ఇక్కడే పాక్ సగం గెలిచింది. ఆరంభంలో పిచ్‌పై లభించిన స్వింగ్‌తో చెలరేగిన పాక్ బౌలర్లు.. అదే జోరును చివరి వరకు కొనసాగిస్తూ వరుసగా వికెట్లు తీశారు. క్రీజులో నిలదొక్కుకున్న పంత్, కోహ్లీ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. ఈ ఇద్దరిని కీలక సమయాల్లో ఔట్ చేసిన పాక్.. తమ ఆధిపత్యాన్ని ఆఖరి వరకు కొనసాగిచింది. ఆ తర్వాత ముంచు కురవడంతో భారత బౌలర్లకు బంతి పట్టు చిక్కలేదు. ఒకవేళ భారత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసుంటే టీమిండియా విజయానికి అవకాశం ఉండేది.

టాప్-3 విఫలం..
భారత ఓటమికి టాస్ ఓ కారణమైతే.. టాప్-3 వైఫల్యం మరో కారణం. షాహిన్ షా అఫ్రిది ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ(0) డకౌట్ అవ్వడం.. భారత్ కొంపముంచింది. బిగ్ వికెట్ కోల్పోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరగ్గా.. మరోవైపు పాకిస్థాన్ పట్టు బిగించేలా చేసింది. ఈ ఒత్తిడిని అధిగమించలేకనే అఫ్రిది వేసిన మరుసటి ఓవర్లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య.. స్కోర్ బోర్డును పెంచే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు.
20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడం భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న పాక్ బౌలర్లు.. రెట్టించిన ఉత్సాహంతో బంతులేసారు. రోహిత్ గనుక డకౌట్ అవ్వకుండా.. రాహుల్‌తో కలిసి కనీసం పవర్ ప్లే ముగిసే వరకు ఆడి మంచి శుభారంభం అందించుంటే భారత్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉండేది. 180 ప్లస్ రన్స్ చేసుంటే పాక్ కచ్చితంగా ఒత్తిడికి గురయ్యేది. అప్పుడు భారత బౌలర్లు కూడా చెలరేగేవారు. ఫలితం మరోలా ఉండేది.

చెత్త బౌలింగ్..
టాప్-3 విఫలమైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ పోరాడే లక్ష్యాన్నే పాక్ ముందు ఉంచింది. కానీ భారత బౌలర్లు దానికి అనుగుణంగా బౌలింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే మహమ్మద్ రిజ్వాన్ సిక్స్, ఫోర్ బాదడంతో 10 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత షమీ సైతం బౌండరీలు ఇవ్వడంతో పాక్ ఓపెనర్లకు పట్టు చిక్కింది.
ఆ తర్వాత బుమ్రా, వరుణ్ కట్టడి చేసినా.. షమీ పరుగులివ్వడంతో బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి లేకుండా పోయింది. ఓ ఎండ్‌లో వరుణ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా.. మరో ఎండ్‌లో పేసర్లు ధారళంగా పరుగులిచ్చారు. భువనేశ్వర్ కుమార్(0/25), మహమ్మద్ షమీ(0/43), జస్‌ప్రీత్ బుమ్రా(0/22),వరుణ్ చక్రవర్తీ(0/33), రవీంద్ర జడేజా(0/28) అందరూ విఫలమయ్యారు. ఫస్ట్ ఓవర్ భువీ కట్టడిగా వేసి పవర్ ప్లేలో వికెట్ తీసుంటే భారత్‌కు గెలిచే అవకాశం ఉండేది. ఎందుకంటే పాక్ బ్యాటింగ్ బలం ఓపెనర్లే. ఈ ఇద్దరిని ఔట్ చేస్తే ఆ జట్టు ఇన్నింగ్స్ పేక మేడల్లా కూలేది. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో చేజింగ్ చేయడం చాలా కష్టం. కానీ ఆ ప్రెజర్‌ను బౌలర్లు బిల్డ్ చేయలేకపోయారు.

రిజ్వాన్, బాబర్ సూపర్ బ్యాటింగ్..
152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ స్మార్ట్‌గా బ్యాటింగ్ చేశారు. దుబాయ్ పరిస్థితులను అద్భుతంగా అంచనా వేసి దానికి అనుగుణంగా బ్యాటింగ్ చేశారు. వారి ఇన్నింగ్స్ చాలా స్మార్ట్‌గా కొనసాగింది. మిస్టరీ స్పిన్‌తో ఇబ్బంది పెట్టిన వరుణ్ చక్రవర్తినీ ఓపికగా ఆడిన ఈ జోడీ.. మిగతా బౌలర్లపై విరుచుకుపడింది. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఎలాంటి తప్పిదాలు చేయకుండా.. ప్రశాంతంగా బ్యాటింగ్ చేసింది. ఏలాంటి ఆతృత కనబర్చకుండా.. పేలవ షాట్లకు పోకుండా సింపుల్‌గా మ్యాచ్‌ను ముగించింది. తమ ప్రణాళికలు పర్పెక్ట్‌గా అమలు చేసింది.

చెత్త బ్యాటింగ్.. పేలవ బౌలింగ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(3), రోహిత్ శర్మ(0), సూర్యకుమార్ యాదవ్(11) దారుణంగా విఫలమవ్వగా.. విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. రిషభ్ పంత్(30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్నందుకుంది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 నాటౌట్), బాబర్ ఆజామ్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 17.5 ఓవర్లలో 152 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications
