
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రైతుగా మారాడు. రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన మహీ ఫ్యామిలీతో గడుపుతూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నాడు. ఇక మహీ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడని, పుచ్చకాయలు పండిస్తున్నాడని గతంలో వినిపించినా.. తాజాగా ధోనీనే స్వయంగా ట్రాక్టర్‌తో పొలంను చదును చేసే వీడియో వెలుగులోకి వచ్చింది.
రాంచీలోని ధోనీ ఫామ్‌హౌస్ విస్తీర్ణం ఏడు ఎకరాలు కాగా.. అందులో కొంతమేర ఇల్లు కట్టుకున్న ధోనీ.. ఖాళీ స్థలంలో ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా దొరికిన బ్రేక్ సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నట్లు సమాచారం. డ్రైవింగ్ అంటే అమితంగా ఇష్టపడే ధోనీ.. స్వయంగా ట్రాక్టర్‌తో పొలం దున్నతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. ఈ వీడియోలో ఇంకో రౌండ్ అన్నట్లు వినిపిస్తుంది.
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో చివరి సారిగా భారత్ తరఫున ఆడిన ధోనీ.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడగా.. ధోనీ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. అతని భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతున్నా.. మహీ మాత్రం మౌనంగానే ఉన్నాడు.