ధోనీ వల్లే రోహిత్ శర్మ 2011 ప్రపంచకప్ ఆడలేదు: మాజీ సెలెక్టర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూచనలతోనే రోహిత్ శర్మను 2011 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోలేదని మాజీ సెలెక్టర్ రాజా వెంకట్ తెలిపాడు. రోహిత్ శర్మకు బదులు పీయూష్ చావ్లా కావాలని ధోనీ చెప్పడాని గుర్తు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ.. 2011 ప్రపంచకప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.
చివరి నిమిషంలో అతను జట్టుకు దూరమయ్యాడు. తన కెరీర్‌లో ఇప్పటికీ తాను బాధపడే విషయం ఏదైనా ఉందా? అంటే 2011 ప్రపంచకప్ ఆడకపోవడమేనని రోహిత్ శర్మ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ వ్యవహారంపై 2008-2012 మధ్య భారత సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న రాజావెంకట్ ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడాడు.

అప్పటి కెప్టెన్ ధోనీ సూచనలతోనే రోహిత్ శర్మను పక్కనపెట్టామని గుర్తు చేసుకున్నాడు. '2011 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ ఉన్నాడు. అప్పుడు టీమిండియా.. సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. సహచర సెలెక్టర్ యశపాల్ శర్మతో పాటు నేను టీమిండియాతో సౌతాఫ్రికాలోనే ఉన్నాం. మిగిలిన ముగ్గురు సెలెక్టర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, సురేంద్ర భవే, నరేంద్ర హిర్వాణి చెన్నైలో ఉన్నారు.
జట్టులోకి 15 మందిని తీసుకోవాలి. 14 మంది ఆటగాళ్లకు సెలెక్షన్ కమిటీ ఆమోదం తెలిపింది. 15వ ఆటగాడిగా మేం రోహిత్ శర్మను సూచించాం. కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా రోహిత్ శర్మ ఎంపికను సమర్థించాడు. కానీ కెప్టెన్ ధోనీ మాత్రం అంగీకరించలేదు. రోహిత్ శర్మకు బదులుగా పీయూష్ చావ్లాను జట్టులోకి తీసుకోవాలనుకున్నాడు.

వెంటనే గ్యారీ కిర్‌స్టెన్ కూడా ధోనీ సూచనకు మద్దతు తెలిపాడు. దాంతో రోహిత్ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.'అని రాజా వెంకట్ చెప్పుకొచ్చాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పీయూష్ చావ్లా నాలుగు వికెట్లు తీసాడు. యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో టీమిండియా రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications