న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న నాయకత్వ లక్షణాలతో పాటు ఆటపై ఉన్న అవగాహనతోనే అతన్ని సారథిగా ఎంపిక చేశామని అప్పటి భారత సెలెక్టర్ భూపిందర్ సింగ్ తెలిపాడు. జట్టులో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్లను కాదని ధోనీని ఎంపిక చేయడానికి గల కారణాలు ఇవేనని ఆయన తాజాగా వెల్లడించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నేపథ్యంలో మరోసారి టీమిండియా ఆట తీరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో భూపిందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒకరిని సారథిని చేయాలని మేం అనుకోలేదు. మేం కెప్టెన్‌గా నియమించాలనుకునే ఆటగాడికి క్రికెట్‌పై అవగాహన ఉండటంతో పాటు సరైన బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుండి నడిపించే నాయకత్వ సామర్థ్యం, టీమ్ వనరులను ఉపయోగించుకునే నైపుణ్యాలు ఉండాలనుకున్నాం.

ఇవన్నీ మాకు ధోనీలో కనిపించాయి. సారథిగా ప్రకటించే ముందు ధోనీ ఆట తీరు, బాడీ లాంగ్వేజ్, ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడనే విషయాలను క్షణ్ణంగా పరిశీలించాం. దాంతో మాకు అతనిపై సానుకూల అభిప్రాయం ఏర్పడింది. అప్పుడే ధోనీని సారథిగా ఎంపిక చేశాం'అని భూపిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ధోనీ సారథ్యంలో టీమిండియా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి 10 ఏళ్లు అయినా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. ద్వైపాక్షి సిరీస్‌లు గెలిచినా.. ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ చేరినా టైటిల్ మాత్రం అందుకోలేకపోతుంది.
ఈ క్రమంలోనే ఐసీసీ టోర్నీల్లో భారత్ విఫలమైనప్పుడల్లా.. ధోనీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఐసీసీ టైటిల్ గెలవడం ధోనీ ఒక్కడికే సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటిపై అప్పటి ఆటగాళ్లు హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్‌లు ఘాటుగా స్పందించారు. అతనొక్కడే పోటుగాడని, తాము ఎవ్వరం ఆడకుండా ఐసీసీ టైటిల్ గెలిచాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.