పేస్ బౌలర్లకు కెప్టెన్సీ అవకాశాలు దక్కడం లేదని టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ స్పందించాడు. కెప్టెన్సీ కోసం బుమ్రా వెంపర్లాడవద్దని సూచించాడు. ఓ ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ .. ఫాస్ట్ బౌలర్లకు కూడా కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని సూచించాడు. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్‌లు సారథులుగా ప్రపంచకప్‌లు గెలిచారని గుర్తు చేశాడు.
అయితే బుమ్రా వ్యాఖ్యలతో బసిత్ అలీ విభేదించాడు. 'జస్‌ప్రీత్ బుమ్రా వ్యాఖ్యలు.. కెప్టెన్సీ అంటే ఇష్టపడే బాబార్ ఆజామ్‌లా ఉన్నాయి. నా అభిప్రాయప్రకారం బుమ్రా కెప్టెన్సీ కోసం ప్రయత్నించవద్దు. అతను టాప్ క్లాస్ బౌలర్. దానిపై మాత్రమే ఫోకస్ పెట్టాలి.

కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్‌లు కెప్టెన్లుగా సక్సెస్ అయ్యారని కూడా బుమ్రా చెప్పాడు. కానీ వారు ఆల్‌రౌండర్స్ అనే విషయాన్ని బుమ్రా మరిచిపోయాడు. ఆల్‌రౌండర్లుగా సత్తా చాటిన తర్వాతే కెప్టెన్లుగా ఎంపికై సక్సెస్ సాధించారు. కేవలం బౌలర్లుగా జట్టులోకి రాగానే వారికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదు. బౌలర్లు, ఆల్‌రౌండర్స్‌కు ఉన్న తేడా ఇదే.
ప్యాట్ కమిన్స్ గురించి కూడా బుమ్రా చెప్పుకొచ్చాడు. బుమ్రా చెప్పినట్లు ప్యాట్ కమిన్స్ అద్భుతమైన కెప్టెన్. కానీ ప్రతీ ఫాస్ట్ బౌలర్ మంచి కెప్టెన్, కోచ్ కావాలనే రూల్ లేదు. జస్‌ప్రీత్ బుమ్రాకు నా బెస్ట్ విషెస్. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం బుమ్రా టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.'అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న బుమ్రా.. జట్టు సారథ్య బాధ్యతలు అందుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ స్వీకరించాలనే ఆలోచనల్లో ఉన్నాడు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతల చేపట్టిన తర్వాత.. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ, వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు బుమ్రా ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంతో అతను కెప్టెన్సీ ఇచ్చే జట్టులోకి పోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.