
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అర్షద్ ఖాన్ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. పాకిస్థాన్ తరఫున 1997-98లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆ ఆఫ్ స్పిన్నర్.. 2006 వరకు 9 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడాడు. ఆఫ్ స్పిన్నర్‌గా ఓ వెలుగు వెలిగిన అర్షద్ ఖాన్.. రిటైర్మెంట్ అనంతరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు ఆస్ట్రేలియా, సిడ్నీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే ఓ భారత నెటిజన్ సోషల్ మీడియా వేదికగా వెల్లగించాడు.
తాను అర్షద్ ఖాన్ నడుపుతున్న క్యాబ్ ఎక్కానని, అతన్ని చూసి షాకయ్యానని తెలిపాడు. అంతేకాకుండా తమ మధ్య జరిగిన సంభాషణను కూడా పంచుకున్నాడు. 'మా క్యాబ్ డ్రైవర్‌గా అతన్ని చూశా. మాములుగా అతనితో మాట్లాడుతుంటే.. తనది పాకిస్థాన్ అని, సిడ్నీలో ఉంటున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా హైదరాబాద్‌కు ఎన్నోసార్లు వచ్చానని, ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో భాగంగా లాహోర్ బాద్‌షాస్ జట్టు తరఫున ఆడానని తెలిపాడు.
నేను వెంటనే అతన్ని ఫుల్ నేమ్ అడిగి అతని ఫేస్ చూశాను. అతను పాక్ మాజీ క్రికెటర్ అని గుర్తు పట్టి షాకయ్యాను'అని సదరు నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్‌లో మొత్తం 89 వికెట్లు తీసిన అర్షద్ ఖాన్.. టీమిండియా 2005 పాక్ పర్యటనలో అదరగొట్టాడు. దిగ్గజ ఆటగాళ్లు అయిన సెహ్వాగ్, సచిన్ వికెట్లను తీశాడు. ఇక తన చివరి టెస్ట్, వన్డేను కూడా అతను భారత్‌తోనే ఆడాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, 2015 వరల్డ్ కప్ విజేత జేవియర్ డోహెర్టీ కూడా ఆర్థిక పరిస్థితులతో కార్పెంటర్‌గా అవతారమెత్తిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన డోహెర్టీ 2001-02 సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ అనంతరం ఆటకు గుడ్‌బై చెప్పాడు. మైకేల్ క్లార్క్ నేతృత్వంలో 2015 ప్రపంచకప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ జేవియర్ సభ్యుడు. ఆస్ట్రేలియా తరఫున 60 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడిన డోహెర్టీ.. 55 వికెట్లు తీశాడు. చివరి సారిగా గతేడాది భారత్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడాడు.