
కరాచీ: పాకిస్థాన్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకొని క్రికెట్ ఆడేవాడని తెలిపాడు. 1987 ఇంగ్లండ్ పర్యటనలో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయిన ఇమ్రాన్ డ్రగ్స్ తీసుకొని బరిలోకి దిగాడని ఈ పాక్ మాజీ క్రికెటర్ గుర్తు చేసుకున్నాడు. ఓసారి తన ఇంటికి వచ్చినప్పుడు కూడా భోజనంతో పాటు మత్తుపదర్థాలు తీసుకున్నాడని తెలిపాడు.
'ఇమ్రాన్ ఖాన్ గంజాయి పీల్చేవాడు. డ్రగ్స్ తీసుకునేవాడు. లండన్ పర్యటనలో కూడా డ్రగ్స్‌తో తీసుకునే బరిలోకి దిగాడు. మా ఇంట్లో కూడా డ్రగ్స్ తీసుకున్నాడు. 1987లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అతను సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకొని ఆటను కొనసాగించాడు. మోహ్‌సిన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, సాలిమ్ మాలిక్‌తో మా ఇంటికి వచ్చినప్పుడు భోజనంతో కలిపి డ్రగ్స్ తీసుకున్నాడు'అని సర్ఫరాజ్ నవాజ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకొని ఆడాడు అనడానికి తానొక్కన్నే సాక్ష్యం కాదని, లండన్‌లో చాలా మందికి అతనో డ్రగ్ అడిక్ట్ అని తెలుసున్నాడు. తన ముందు నిలబెట్టి అడిగితే ఇమ్రాన్ ఖాన్‌ను కూడా డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని ఖండించలేడని తెలిపాడు. ఇక ఈ వ్యాఖ్యలు పాక్ క్రికెట్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. పాకిస్థాన్‌కు 1992లో ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్.. టెస్ట్‌ల్లో 362, వన్డేల్లో 182 వికెట్లు తీశాడు. 1980 సమయంలో ఇమ్రాన్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్‌లు పాక్ జట్టుకు కీలక బౌలర్లుగా సేవలందించారు. దాంతో సర్ఫరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.