టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ విన్నర్ కాదని, సిరీస్ విన్నర్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడాన్ని తప్పుబట్టాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన అశ్విన్.. ఐపీఎల్‌తో పాటు క్లబ్ క్రికెట్ ఆడుతానని స్పష్టం చేశాడు.

అశ్విన్ రిటైర్మెంట్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన బసిత్ అలీ... అతని నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సిరీస్ మధ్యలో వీడ్కోలు పలకడం సరికాదన్నాడు. అశ్విన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కన్విన్స్ చేయాల్సిందన్నాడు.
'సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదు. అతను రిటైర్మెంట్‌పై నిర్ణయానికి వచ్చినప్పుడు.. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపికచేసినప్పుడే తప్పుకోవాల్సింది. లేదంటే ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన తర్వాత వీడ్కోలు పలకాల్సింది. కనీసం న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన తర్వాత తప్పుకున్నా బాగుండేది. సిరీస్ మధ్యలో తప్పుకోవడం చెత్త నిర్ణయం.
రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ అయినా అశ్విన్‌ను ఆఖరి టెస్ట్ వరకు జట్టులో కొనసాగేలా కన్విన్స్ చేయాల్సింది. చివరి రెండు టెస్ట్‌ల్లో నీ అవసరం ఉంటుందని, సిడ్నీ టెస్ట్‌లో ఆడాల్సి ఉంటుందని అశ్విన్‌కు చెప్పాల్సింది. రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ విన్నర్ కాదు. ఆయన సిరీస్ విన్నర్. అతను సిరీస్‌ను గెలిపించే ఆటగాడు.
టీ20ల్లో ఒక్క ఇన్నింగ్స్ బాగా ఆడి గెలిపిస్తే మ్యాచ్ విన్నర్ అంటాం. టోర్నీ మొత్తం బాగా ఆడితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా పిలుస్తారు. కానీ సిరీస్‌ను గెలిపించే ఆటగాళ్లను సిరీస్ విన్నర్ అనాలి. 15 బంతుల్లో 35 పరుగులు చేసి విజయాన్ని అందించడం వేరు. క్రికెట్‌లో రెడ్ బాల్ గేమ్ టాప్. హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, అశ్విన్.. మ్యాచ్ విన్నర్లు.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు.
2010 శ్రీలంక పర్యటనలో హరారే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసాడు.
టెస్ట్‌ల్లో 106 మ్యాచ్‌ల్లో 2.83 ఎకానమీతో 537 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ఘనతను 37 సార్లు అందుకున్నాడు. 116 వన్డేల్లో 4.93 ఎకానమీతో 156 వికెట్లుత తీసాడు. 65 టీ20ల్లో 6.90 ఎకానమీతో 72 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 4, 400 పరుగులు చేశాడు. 106 టెస్ట్‌ల్లో 25.75 సగటుతో 3503 పరుగులు చేసిన్ అశ్విన్.. 6 సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.