
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆ దేశ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డు అలసత్వంతోనే పాకిస్థాన్ క్రికెటర్లు కరోనా బారినపడ్డారని ఆరోపించాడు. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఔట్ డోర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారని మండిపడ్డాడు. ఇప్పటికైనా మేల్కోని ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఈ పాక్ మాజీ కెప్టెన్ పీసీబీకి చురకలింటించాడు.
ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టీ20ల కోసం 29 మందితో భారీ జట్టును పాక్ ప్రకటించగా... దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్‌గా తేలింది. మొత్తం 10 మంది ఆటగాళ్లు మహమ్మారి బారిన పడటంతో యావత్ క్రికెట్‌లోకం కలవరపాటుకు గురైంది. దీనిపై సొంత యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన రషీద్ లతీఫ్.. పీసీబీ నిర్వహణ వైఫల్యం వల్లే ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లంతా కలిసి ప్రాక్టీస్ చేయడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం తాను చూశానని తెలిపాడు. అదే ఆటగాళ్ల కొంపముంచిందన్నాడు.
'కరోనా పాజిటీవ్ వచ్చిన ఆటగాళ్లంతా ఔట్‌డోర్‌లో కలిసి ప్రాక్టీస్ చేసారు. ఈ అజాగ్రత్తనే వారిని వైరస్ బారిన పడేలా చేసింది. పీసీబీ కూడా ఆటగాళ్ల రక్షణకు కనీస చర్యలు చేపట్టలేదు. నేను కూడా ఓ రోజు మైదానానికి వెళ్లాను. కానీ భౌతిక దూరం పాటించా. మీరు కూడా ప్రొటోకాల్స్ పాటిస్తూ భౌతిక దూరం పాటించండి'అని లతీఫ్ కోరాడు.
ఇక పది మంది ఆటగాళ్లకు కరోనా వచ్చినా.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించింది. ఇక కరోనా సోకిన ఆటగాళ్లలో మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్‌నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్, హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్‌లు ఉన్నారు. అయితే ఆల్‌రౌండర్ మొహ్మద్ హాఫీజ్ మాత్రం తనకు కరోనా సోకలేదని ట్వీట్ చేశాడు.
స్వయం తృప్తి కొరకు మరోసారి కరోనా పరీక్షలు చేసుకోగా తనకు నెగటీవ్ వచ్చిందని, ఆ అల్లా దయతో తన కుంటుంబ సభ్యులకు కూడా కరోనా లేదని తేలిందన్నాడు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను కూడా షేర్ చేశాడు. ఇక కరోనా బారిన చికిత్స తీసుకుంటున్న పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోనా లైట్ తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.