రంజీ క్రికెట్‌లో మహారాష్ట్ర ఆల్‌రౌండర్ జలజ్ సక్సెనా గణంకాలను చూసి మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ, మాజీ సెలెక్టర్ సలీల్ అంకోలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ఇంత మెరుగ్గా రాణించినా.. టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కలేదా? అని వ్యాఖ్యానించారు. బుధవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ 2025 26 సీజన్‌లో భాగంగా కేరళ, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌కు ఈ ఇద్దరూ మాజీ సెలెక్టర్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా.. 58 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో జలజ్ సక్సెనా ఏడో బ్యాటర్‌గా మైదానంలోకి వచ్చాడు. ఈ క్రమంలో టీవీలో అతని గణంకాలు డిస్ ప్లే అయ్యాయి. దేశవాళీ క్రికెట్‌లో బ్యాటింగ్‌లో 7000 పైగా పరుగులు చేసిన జలజ్ సక్సెనా.. బౌలింగ్‌లో 450 ప్లస్ వికెట్లు తీసాడు.

ఈ గణంకాలను చూసిన సలీల్ అంకోలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఇతనికి ఇప్పటి వరకు టీమిండియాలో ఆడే అవకాశం దక్కలేదా? అని అన్నాడు. వెంటనే చేతన్ శర్మ జోక్యం చేసుకొని 'సలీల్.. నువ్వు ఆశ్చర్యకరమైన అనే పదాన్ని వాడుతున్నావ్. కానీ మనమిద్దరం మాజీ సెలెక్టర్లం.'అని బదులిచ్చాడు. వెంటనే సలీల్ నవ్వుతూ.. 'నేను సెలెక్టర్ అయితే.. మీరు చీఫ్ సెలెక్టర్'అని బదులిచ్చాడు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఈ ఇద్దరి మాజీ సెలెక్టర్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప ఆల్‌రౌండర్ కెరీర్‌ను నాశనం చేసి, నవ్వుకుంటారా? అని మండిపడుతున్నారు.
38 ఏళ్ల జలజ్ సక్సెనా.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఆల్‌రౌండర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 7000 ప్లస్ పరుగులు, 450 ప్లస్ వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్. అతని కన్నా ముందు కపిల్ దేవ్, మదన్ లాల్, రవీంద్ర జడేజా ఈ ఫీట్ సాధించారు. 2005లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన జలజ్ సక్సెనా 150 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 7060 పరుగులు చేసి 484 వికెట్లు పడగొట్టాడు.
చేతన్ శర్మ 2020 నుంచి 2023 వరకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశాడు. సలీల్ అంకోలా 2023 24 వరకు సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఈ ఇద్దరూ జలజ్ సక్సెనాను పట్టించుకోలేదు.