టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అంబటి రాయుడు అంతలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు.
'వైఎస్సార్‌సీపీ పార్టీ నుంచి వైదొలుగుతున్నాను. కొంత కాలం నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తు కార్యచరణను త్వరలో ప్రకటిస్తాను'అని అంబటి రాయుడు ట్వీట్ చేశారు.

ఐపీఎల్ 2023 సీజన్ విజయానంతరం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబర్చారు. పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే గత ఏడాదిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ.. ప్రజలతో మమేకమయ్యారు.
గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన వారం రోజుల క్రితమే వైఎస్సార్‌సీపీలోకి అధికారికంగా చేరారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానానికి రాయుడు పోటీ చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంతలోనే రాయుడు యూటర్న్ తీసుకున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉండటంతో పాటు వైఎస్సార్‌సీపీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. టికెట్ విషయంపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే రాయుడు తప్పుకున్నట్లు అర్థమవుతోంది. రాయుడు నిలకడలేని మనిషని, ఇలానే దూకుడుగా వ్యవహరించి క్రికెట్ కెరీర్‌ను నాశనం చేసుకున్నాడని, ఇప్పుడు రాజకీయాల్లోను తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
పొలిటికల్ ఇన్నింగ్స్‌లో సిక్స్‌లు బాదుతాడని భావించిన రాయుడు.. హిట్ వికెట్‌గా డకౌటయ్యారని కామెంట్ చేస్తున్నారు. కాస్త ఓపిక పడితే రాయుడికి మంచి గౌరవం దక్కేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రాయుడి నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రాయుడు యూటర్న్ తీసుకోవడం ఇదే కొత్త కాదు. రిటైర్మెంట్ విషయంలోనూ ఇలానే తొందరపడి యూటర్న్ తీసుకున్నారు.