ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో శుభారంభం అందుకోలేకపోయిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. తొలి టెస్ట్ పరాజయం నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో భారత్ ఉంది. అందుకోసం జట్టులో చేయాల్సిన మార్పులపై ఫోకస్ పెట్టింది.
అయితే ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేయాలని భారత మాజీ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ సూచించారు. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మిగతా జట్టులో మార్పులు అవసరం లేదన్నారు. బుమ్రా ఫిట్‌గా ఉంటే అతన్ని జట్టులో కొనసాగించాలని తెలిపారు.

'ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు టీమిండియా తమ తుది జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. బుమ్రా ఫిట్‌గా ఉంటే అతన్ని ఆడించాలి. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేయాలి. శార్దూల్ ఠాకూర్‌ను తప్పించి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. కుల్దీప్ యాదవ్ ఆడితే టీమిండియాకు అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారుతాడు. ఇది చాలా పెద్ద సిరీస్. ఐదు మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది ఒక్కటే. కాబట్టి సానుకూలంగా ఉందాం.
తొలి టెస్ట్‌లో ధారళంగా పరుగులిచ్చిన ప్రసిధ్ కృష్ణను తుది జట్టులో కొనసాగించాలి. ఎందుకంటే అతను పరుగులిచ్చినా వికెట్లు తీసాడు. అతని బౌలింగ్‌లో మంచి పేస్‌తో పాటు బౌన్సర్లు వేయగల సామర్థ్యం ఉంది. బర్మింగ్‌హామ్‌లో అతను కీలకం అవుతాడు. అతను ఓ మంచి బౌలర్. కానీ అతనికి కాస్త ఆత్మవిశ్వాసం కావాలి. ఈ సిరీస్‌లో భారత్ ఖచ్చితంగా పుంజుకొంటుంది. వికెట్‌పై గ్రాస్ ఉంటే.. ప్రసిధ్ ఎత్తు, పేస్, బౌన్స్ జట్టుకు ఉపయోగపడుతాయి.'అని శరణ్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చారు.