
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన సతీమణి దేవాన్షి పొపట్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిందని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'ఆ దేవుని చల్లని దీవెనలతో దేవాన్షి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ప్రకటించడం పట్ల మేమిద్దరం చాలా సంతోషంగా ఫీలవుతున్నాం'అని 34 ఏళ్ల ఆర్పీ సింగ్ ట్వీట్ చేశాడు. 2012లో దేవాన్షి-ఆర్పీ సింగ్ వివాహం జరగగా.. 2017లో వీరికి ఇరా ఆర్య సింగ్ అనే పాప పుట్టింది. ఇక గుడ్ న్యూస్ షేర్ చేసిన ఆర్పీసింగ్‌కు మాజీ, సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.
భారత్ తరఫున 14 టెస్ట్‌లు, 58 వన్డేలు ఆడిన ఆర్పీ సింగ్.. 2018 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దశాబ్ద కాలం క్రితమే భారత జట్టుకు దూరమైన ఈ మాజీ పేసర్.. టెస్ట్‌ల్లో 116, వన్డేల్లో 104 వికెట్లు తీశాడు. 2005లో జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. 2006లో పాకిస్థాన్‌తో సంప్రదాయక ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు.
కెరీర్‌లో మూడో వన్డేలోనే నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ జట్టులో ఆర్పీ సింగ్ కీలక సభ్యుడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్పీ సింగ్.. 12.66 సగటుతో 7 వికెట్లు తీసి.. సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఇక భారత్ తరఫున చివరిసారిగా 2011లో ఇంగ్లండ్‌తో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్‌లో తన ఆటను కొనసాగించాడు. డెక్కన్ చార్జెస్‌తో ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టిన ఆర్పీ సింగ్.. అనంతరం కొచ్చి టస్కర్స్ కేరళ, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక రిటైర్మెంట్‌కు ముందు నుంచే కామెంటేటర్‌గా పనిచేస్తున్న ఆర్పీ సింగ్.. ఇప్పటికీ పలుచర్చ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు.