ఓ సీనియర్ ఆటగాడి వల్లనే తనపై తాగుబోతు క్రికెటరని ముద్రపడిందని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ తెలిపాడు. ఆ సీనియర్ ప్లేయర్ ఎవరో చెప్పకపోయినా.. అతని దుష్ప్రచారం వల్లనే తన ఇమేజ్ దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నాడు. మద్యం సేవించే అతని వ్యసనాన్ని కప్పిపుచ్చుకునేందుకు తనపై తాగుబోతనే ముద్ర వేసాడని చెప్పాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నేను భారత జట్టులో చేరినప్పుడు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తాగుడు మానేసి కొన్ని ఇతర విషయాలకు దూరంగా ఉండాలని నాకు చెప్పారు. విషయం ఏంటంటే అందరూ ఆల్కహాల్ తీసుకునేవారే.

కానీ నా పేరును మాత్రమే బద్నాం చేశారు. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు మమ్మల్ని బాగానే చూసుకున్నారు. ఒకడు మాత్రం నాపై అసత్య ప్రచారం చేశాడు. అతని పేరును నేను కెమెరా ముందు చెప్పాలనుకోవడం లేదు. కానీ అతను ఎవరో అందరికి తెలుసు. తాగుబోతు అనే దుష్ప్రచారం వల్ల నా కోచింగ్ కెరీర్ ముందుకు సాగలేకపోయింది.
ఐపీఎల్ 2018 సమయంలో ఏ ఫ్రాంచైజీ అయినా నాకు బౌలింగ్ కోచ్‌గా అవకాశం ఇస్తుందేమోనని ఆశించా. కానీ ఎవరూ సంప్రదించలేదు. చివరకు నా సొంతరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జట్టు కూడా రంజీటీమ్ కోచ్‌గా పనిచేసే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను తాగుబోతునని వారు బలంగా నమ్మారు. నేను ఏమైనా మైదానంలోనే తాగానా? లేక డ్రెస్సింగ్ రూమ్‌లోనే బాటిల్ ఓపెన్ చేశానా?
ఈ తరహా దుష్ప్రచారంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. ప్రతీ రోజు 5 గంటలపాటు సీలింగ్ ఫ్యాన్‌వైపే చూస్తూ ఉండిపోయాను. కెరీర్‌లో ఇన్ని విజయాలు సాధించినా ఎవరూ నన్ను పిలవకపోవడం చూసి చాలా నిరాశకు లోనయ్యాను. కొన్ని రోజులు హరిద్వార్ వెళ్లాను. అక్కడికి వెళ్లడంతో నా మానసిక పరిస్థితి కుదుటపడింది.'అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
2008లో తాను ఓ డాక్టర్‌ను కొట్టాననే ప్రచారం కూడా అవాస్తవమని ప్రవీణ్ కుమార్ తెలిపాడు. 'నేను, మా బ్రదర్ రివాల్వర్ కొనేందుకు షాప్‌కు వెళ్లాము. అది వర్ష కాలం. రివాల్వర్ తీసుకున్న తర్వాత మేం చాలా ఉత్సాహంగా బయటకు వచ్చాం. ఆ సమయంలో వ్యాగనర్ కారు మా వైపు వచ్చింది. అక్కడ నీటితో నిండిన బురద గుంత ఉండటంతో నిదానంగా రావాలని ఆ కారు డ్రైవర్‌కు సూచించాను.
కానీ అతను అలానే వేగంగా రావడంతో మురికి వాటర్ మాపై పడ్డాయి. ఆ డ్రైవర్ మీరట్‌లో ఇలా వాటర్ పడటం సహజమేనని బదులిచ్చాడు. అక్కడి నుంచి నేను వెళ్లిపోగా.. మా స్నేహితులు అతన్ని కొట్టారు. అంతే తప్పా నేను కొట్టలేదు.'అని ప్రవీణ్ కుమార్ తెలిపాడు.
ప్రవీణ్ కుమార్.. భారత్ తరఫున 6 టెస్ట్‌లు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో 122 వికెట్లు తీసాడు. ఐపీఎల్ 119 మ్యాచ్‌లు ఆడిన అతను 90 వికెట్లు పడగొట్టాడు.