
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిల మనస్థత్వాలు దగ్గరగా ఉండటమే వారి సక్సెస్‌కు కారణమని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కావల్సినంత స్వేచ్చ ఇస్తాడని, అలాగే కోచ్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడో కూడా కోహ్లీకి బాగా తెలుసన్నాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న నెహ్రా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'రవిశాస్త్రి ఓ గొప్ప మోటివేటర్. అదే రవిభాయ్ బలం. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. నీవు పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్నా నిన్ను భుజం తట్టి ముందుకు నడిపిస్తాడు. విరాట్ కూడా జట్టును అదే రీతిలో నడిపిస్తాడు. ఇద్దరి మనస్థత్వాలు, ఆలోచనలు ఒకటే. దాంతోనే వారి మధ్య మంచి సమన్వయం ఉంది. నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కూడా ఒకరికొకరి అభిప్రాయాలను గౌరవించుకుంటారు.'అని నెహ్రా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రవిశాస్త్రిని భారత జట్టు కోచ్‌గా 2017లో ఎంపిక చేశారు. ఇక కోహ్లీ-రవిశాస్త్రి కాంబినేషన్‌లోని భారత జట్టు మంచి విజాయాలనందుకుంది. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది.
ఇక ఇదే షోలో ధోనీ రిటైర్మెంట్‌పై నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే ధోనీ సంతోషంగా భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడేసాడని తెలిపాడు. అయితే అతని అంతర్జాతీయ క్రికెట్‌కు ఐపీఎల్‌కు ఏ మాత్రం సంబంధం లేదన్నాడు. 'ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఐపీఎల్‌తో ముడిపడి ఉందని నేను అనుకోవడం లేదు.
ధోనీ ఆడటానికి సిద్దంగా ఉంటే మాత్రం సెలెక్టర్, కెప్టెన్, కోచ్ ఎవరున్నా.. అతను జట్టులోకి వస్తాడు. నాకు తెలిసి ధోనీ.. భారత్ తరఫున సంతోషంగా చివరి మ్యాచ్ ఆడేశాడు. అయితే ధోనీ నిరూపించుకోవాల్సింది కూడా ఏదీ లేదు. అతడింకా రిటైర్మెంట్ ప్రకటించకపోవడం వల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. త్వరలోనే మహీ ఒక నిర్ణయం తీసుకుంటాడు. అతని ఆలోచనలను స్వయంగా వెల్లడిస్తాడు. నా దృష్టిలో ధోనీ ఆట ఎప్పుడు దిగజారదు.'అని నెహ్రా తెలిపాడు.