టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ప్రేమయాణాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించాడు. సోఫీ షైన్‌తో దిగిన ఫొటోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. సోషీ ఫైన్ తన ప్రియ సఖి అని తెలియజేస్తూ లవ్ సింబల్ ఎమోజీని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం ఈ ఫొటోను లైక్ చేశారు. తన సతీమణి ఆయేషా ముఖర్జీతో విడాకుల అనంతరం శిఖర్ ధావన్ సోఫీ షైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఈ ఇద్దరూ హాజరు కావడంతో పాటు సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ఆయేషా ముఖర్జీ ఉండగానే.. సోఫీ షైన్‌తో శిఖర్ ధావన్ డేటింగ్ చేశాడనే ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి తానే సోఫీ షైన్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి ఈ పుకార్లను నిజం చేశాడు.

ఎవరీ సోఫీ షైన్..
హాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సోఫీ షైన్ వయసు 35 ఏళ్లు. ఆమె ఒక ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్. ప్రస్తుతం అబుదాబిలో పని చేస్తున్నారు. సోఫీ షైన్ లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. దుబాయ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
12 ఏళ్ల వివాహ బంధానికి తెర..
తన కంటే 10 ఏళ్లు పెద్దదైనా ఆయేషా ముఖర్జీని కూడా శిఖర్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు సహజీవనం చేసిన ఈ జోడీ.. 2012లో పెళ్లితో ఒక్కటైంది. అప్పటికే ఆయేషా ముఖర్జీకి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2013 డిసెంబర్‌లో ఈ జోడీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతని పేరు జొరావర్. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జోడీ తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంది. తన కొడుకు జొరావర్‌ను ఆయేషా కుటుంబం కలవనిస్తలేదని ధావన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.