ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వచ్ఛందంగా తన సారథ్య బాధ్యతలను వదులుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టును విశ్లేషించిన శ్రీకాంత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో కలిసి చర్చించాలి. ఈ ఏడాది కెప్టెన్సీ బాధ్యతను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించాలి. హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్. అయితే.. ఇక్కడ ఓ విచిత్రమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన ఇద్దరు కెప్టెన్లు ఆడుతున్నారు. నిజానికి సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అందించాలి. అయితే ఫ్రాంచైజీ యాజమాన్యం హార్దిక్ పాండ్యా వైపే మొగ్గు చూపుతుండొచ్చు.

రోహిత్ శర్మ, సూర్యకుమార్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో హార్దిక్ పాండ్యా సభ్యుడిగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా స్వచ్ఛందంగా తన కెప్టెన్సీని వదులుకోవాలి. సారథ్య బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించాలి. అప్పుడు ఫ్రాంచైజీకి పని తేలికవుతుంది. 'సూర్యను కెప్టెన్ చేయండి. నేను అతనికి మద్దతిస్తాను.'అని హార్దిక్ పాండ్యా ముందుకురావాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుంది.'అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్ చేరినా.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. హార్దిక్ పాండ్యాకు సీనియర్లు సహకరించడం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.