టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారికి మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో హనుమ విహారికి నెలకొన్న వివాదంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. తాను హనుమ విహారి వాదననే నమ్ముతున్నానని తెలిపాడు.
జట్టులోని 17వ సభ్యుడైన ఓ యువ ప్లేయర్‌ను తిట్టానని తనను ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని హనుమ విహారి ఆరోపించాడు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన సదరు ప్లేయర్.. అసోసియేషన్‌పై ఒత్తిడి తెచ్చి తనపై వేటు వేయించాడని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

దాంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. హనుమ విహారికి మద్దతుగా అభిమానులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు నిలిచారు. రవిచంద్రన్ అశ్విన్.. ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ చానెల్‌లో చిట్ చాట్ చేసేందుకు హనుమ విహారిని ఆహ్వానించాడు. తాజాగా ఆకాశ్ చోప్రా సైతం విహారికే అండగా నిలిచాడు.
'బురద చల్లడం, నిందలు వేసుకోవడం రెండు వైపుల జరుగుతోంది. సోదరభావంతో చెబుతున్నా.. సహచర ఆటగాడిపై ఎప్పుడూ నమ్మకం ఉంచాలి. హనుమ విహారి కేవలం ప్లేయర్ మాత్రమే కాదు. చేతి విరిగినా ఆంధ్ర తరఫున ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశాడు. ఆంధ్ర జట్టు తరఫున అద్భుతమైన ప్రయాణం చేశాడు. ఆంధ్ర నాకౌట్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టును ఏకతాటి పైకి తీసుకొచ్చాడు. భారత్ తరఫున తొడకండరాల గాయంతోనే సిడ్నీ టెస్ట్ ఆడి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచాడు.
కెరీర్‌కు ప్రమాదమని తెలిసినా ఆంధ్రా కోసం ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశాడు. అలాంటి హనుమ విహారిపై నాకు అపారమైన గౌరవం ఉంది. నేను హనుమ విహారి వాదనను నమ్ముతున్నాను'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై హనుమ విహారి చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షాలు.. అధికారిక పార్టీ వైఎస్సార్‌సీపీతో పాటు ఏసీఏపై దుమ్మెత్తిపోసాయి. ఈ నేపథ్యంలో ఏసీఏ.. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో హనుమ విహారి తప్పిదాలను ఆధారాలతో సహా ప్రస్తావించింది. గత కొద్ది రోజులుగా ఎన్‌ఓసీ కోసం హనుమ విహారి ఏసీఏపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని తెలిపింది.
జట్టులోని ఆటగాళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ అతనిపై తమకు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఇక సెలెక్షన్ కమిటీ సిఫార్సు మేరకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించామని, ఈ విషయం హనుమ విహారికి కూడా తెలుసని తెలిపింది. బెంగాల్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా హనుమ విహారి ఉద్దేశపూర్వకంగానే కేఎస్ పృథ్వీరాజ్‌కు తుది జట్టులో చోటివ్వలేదని తెలిపింది.