టీమిండియా మాజీ క్రికెటర్ జాకోబ్ మార్టిన్ డ్రంకన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయ్యారు. మద్యం మత్తులో వాహనం నడిపిన 53 ఏళ్ల జాకోబ్ మార్టిన్ బరోడాలో మూడు వాహనాలను ఢీకొట్టారు. ఆల్కహాల్ తాగి వాహనం నడిపారని గుర్తించి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్‌పై జాకోబ్ మార్టిన్ విడుదలయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మార్టిన్ తన నివాసానికి వెళ్తుండగా చోటు చేసుకుందని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది.
ఘటన సమయంలో జాకోబ్ మార్టిన్ మద్యం మత్తులో ఉన్నారని, కనీసం నడవలేకపోయారని ఓ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు ఆయనపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్), మోటారు వాహనాలు చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సదరు అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని తెలిపారు.

1999-2001 మధ్య కాలంలో జాకోబ్ మార్టిన్ భారత్ తరఫున 10 వన్డేలు ఆడారు. సౌరవ్ గంగూలీ సారథ్యంలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన మార్టిన్‌కు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో వన్డేలో 33 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2001 అక్టోబర్‌లో కెన్యాపై జాకోబ్ మార్టిన్ తన చివరి వన్డే ఆడాడు. ఆ మ్యాచ్‌లో మార్టిన్ 70 బంతుల్లో 36 పరుగులు చేయగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో 10 మ్యాచ్‌లే ఆడినా.. దేశవాళీ క్రికెట్‌లో రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. బరోడా, ఆస్సాం, రైల్వేస్ జట్ల తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. 1991/92 రంజీ సీజన్‌తో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మార్టిన్.. 138 మ్యాచ్‌ల్లో 46.65 సగటుతో 9192 పరుగులు చేశారు. 2009లో మహారాష్ట్రతో బరోడా తరపున తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడారు. 101 లిస్ట్ A మ్యాచ్‌ల్లో 2948 పరుగులు చేసిన మార్టిన్.. బరోడా తరపున రెండు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడారు.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. బరోడా జట్టుకు కోచ్‌గా పనిచేశారు. 2018లో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు.