
లక్నో: కరోనా వైరస్ బారిన పడిన భారత మాజీ క్రికెటర్, ఉత్తర ప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చౌహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూలైలో చౌహన్ కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ అని తేలింది. వెంటనే ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ట్రీట్‌మెంట్ సమయంలోనే చౌహన్‌కు రక్తపోటుతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. దీంతో వైద్యులు శుక్రవారం రాత్రి నుంచి ఆయనకు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నారు.
భారత్ తరఫున 7 వన్డేలు, 40 టెస్ట్‌లకు ప్రాతినిథ్యం వహించిన 73 ఏళ్ల చౌహన్.. సంప్రదాయక ఫార్మాట్‌లో 31.57 సగటుతో 2084 రన్స్ చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్‌లో 21.85 సగటుతో 153 పరుగులు చేశాడు. రంజీల్లో మహారాష్ట్ర, ఢిల్లీ జట్లకు ఆడిన చౌహన్.. 1981లో అర్జున అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం యోగీ ఆదిత్యనాథ్ కెబినేట్‌లో సైనిక్ వెల్ఫేర్, హోమ్ గార్డ్స్, పీఆర్డీ మరియు సివిల్ సెక్యూరిటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు బీజేపీ తరఫున రెండు సార్లు ఎంపీగా కూడా గెలిచారు.
సునీల్ గవాస్కర్, చౌహన్ ఓపెనర్లుగా 10కి పైగా సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇక 1979లో ఇంగ్లండ్‌తో ఒవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గవాస్కర్-చౌహన్ జోడీ తొలి వికెట్‌కు 213 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇందులో చౌహన్ 80 పరుగులు చేశాడు. ఇక దేశాళీ క్రికెట్‌లో 179 మ్యాచ్‌లు ఆడిన చౌహన్.. 40.22 సగటుతో 11143 రన్స్ చేశాడు. ఇందులో 21 సెంచరీలున్నాయి.